#India vs England: చెన్నై చెపాక్ స్టేడియం టీమిండియాకు స్పెషల్.. ఊరిస్తున్న ఆ రికార్డుపై కోహ్లీ సేన కన్ను

|

Feb 03, 2021 | 5:57 PM

చాలా కాలం తర్వాత స్వదేశంలో క్రికెట్ ఆడబోతున్న టీమిండియా ఓ రికార్డుపై కన్నేసింది. దాదాపు 88 ఏళ్ళుగా టెస్టు క్రికెట్ ఆడుతున్న భారత జట్టు తరపున ఇప్పటి వరకు కేవలం మూడే ట్రిపుల్ సెంచరీలు నమోదు అయ్యాయి.

#India vs England: చెన్నై చెపాక్ స్టేడియం టీమిండియాకు స్పెషల్.. ఊరిస్తున్న ఆ రికార్డుపై కోహ్లీ సేన కన్ను
Follow us on

TeamIndia eyes triple century in Chennai: సుదీర్ఘ విరామం తర్వాత దేశంలో క్రికెట్ సిరీస్ జరగబోతోంది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్ ముగించుకుని వచ్చిన భారత జట్టు.. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చెన్నైలో జరగనున్న మ్యాచ్‌తో ఇంగ్లాండ్ జట్టుతో టెస్టు సిరీస్ ప్రారంభించబోతోంది. ఇరు జట్లు ఇప్పటికే చెన్నై చేరుకున్నాయి. పలువురు ఆటగాళ్ళు ప్రాక్టీస్ కూడా ప్రారంభించేశారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికరమైన అంశం చర్చల్లోకి వచ్చింది. అదే ట్రిపుల్ సెంచరీ పాజిబిలిటీ. తాజాగా నాలుగు టెస్టుల సిరీస్ భారత జట్టు స్వదేశంలో ఆడబోతుండడంతో మరోసారి ట్రిపుల్ సెంచరీ అంశం క్రికెట్ అభిమానుల్లో చర్చకొచ్చింది.

చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో శుక్రవారం నుంచి భారత్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌ ప్రారంభం కానుంది. గతంలో చెపాక్‌ స్టేడియం క్రికెట్‌ అభిమానులకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. భారత జట్టు టెస్టుల్లో ఆడడం మొదలైన 18 ఏళ్ళ తర్వాత తొలి టెస్టు విజయాన్ని పొందింది చెన్నై చెపాక్ స్టేడియంలోనే. 1934లో మొదలైన భారత క్రికెట్.. 1952లో ఈ గ్రౌండ్‌లోనే తొలి టెస్టు విజయాన్ని రుచి చూసింది. పద్దెనిమిది సంవత్సరాల పాటు ఓటములకు, డ్రాలకే పరిమితమైన భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో చెన్నైలో జరిగిన 1952 సిరీస్ అయిదో టెస్టులో తొలి విజయం నమోదు చేసింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 266 పరుగులకు ఆలౌటయింది. ఎనిమిది వికెట్లు తీసిన వినూ మన్కడ్ ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత భారత్ జట్టు 457 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. భారత్ జట్టు తరుపున రెండు సెంచరీలు నమోదయ్యాయి. పాలీ ఉమ్రిగర్ 130 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంకజ్ రాయ్ 111 పరుగులు, దత్తు ఫడ్కర్ 61 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 183 పరుగులకే పరిమితం కాగా భారత జట్టు తొలి టెస్టు విజయాన్ని ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో నమోదు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌ని 8 వికెట్లు తీయడం ద్వారా కుప్ప కూల్చిన వినూ మన్కడ్ రెండో ఇన్నింగ్స్‌లోను నాలుగు వికెట్లు తీశాడు.

భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ 30వ సెంచరీ ఇక్కడే నమోదు చేశాడు. చెపాక్ స్టేడియం అటే టీమిండియా సభ్యులకు ఎక్కడాలేని హుషారు వచ్చేస్తుంది. భారత క్రికెట్ చరిత్రలో మూడు ట్రిపుల్ సెంచరీలు నమోదైతే అందులో రెండు చెన్నైలోనే నమోదయ్యాయి. 2008లో వీరేంద్ర సెహ్వాగ్ వీరవిహారం చేసి 319 పరుగులు చేస్తే.. ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు యువ క్రికెటర్ కరుణ్‌ నాయర్‌ 2016లో 309 పరుగులతో సునామీ సృష్టించాడు. టీమిండియా తన అత్యధిక స్కోరు (759/7) నమోదైంది కూడా చెపాక్‌ స్టేడియంలోనే.

భారత జట్టు తరఫున ఆడిన వారిలో తొలి ట్రిపుల్ సెంచరీ సాధించింది వీరేంద్ర సెహ్వాగే. ముందుకు 2004లో పాకిస్తాన్ పర్యటనలో భాగంగా ముల్తాన్ స్టేడియంలో జరిగిన టెస్టులో సెహ్వాగ్ తొలి ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. ముల్తాన్ టెస్టులో వీరేంద్రుడు 309 పరుగులు చేశాడు. ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే 2008లో దక్షిణాఫ్రికాతో చెన్నైలో జరిగిన తొలి టెస్టులో మరో ట్రిపుల్ సెంచరీ చేశాడు సెహ్వాగ్. సెహ్వాగ్‌ వీరబాదుడుకు 2008 భారత పర్యటన సౌతాఫ్రికా ఆటగాళ్ళకు పీడకలగా మిగిలింది. చెపాక్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో గ్రేమ్‌స్మిత్‌ సేన 540 పరుగులు చేసింది. హషీం ఆమ్లా 159 పరుగులు సాధించాడు. దాంతో భారత్‌ జట్టుకు తిప్పలు తప్పవని అందరు అనుకున్నారు. కానీ వీరేంద్రుని వీర బాదుడు ఇన్నింగ్స్ టెస్టు గమనాన్ని మార్చేసింది. ఏ బౌలర్‌ను వదలని వీరేంద్ర సెహ్వాగ్… 319 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. సీనియర్ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కూడా సెంచరీ సాధించిన ఈ టెస్టులో సెహ్వాగ్ 42 ఫోర్లు, 5 సిక్సర్లతో భారీ ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌ 627 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ కూడా రాణించడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

సెహ్వాగ్‌ ట్రిపుల్ సెంచరీ చేసిన ఎనిమిదేళ్ల తర్వాత యువ ఆటగాడు కరుణ్‌ నాయర్‌ చెన్నైలోనే మరో ట్రిపుల్ సెంచరీ కొట్టాడు. 2016లో భారత్‌ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్‌పై నాయర్ రెచ్చిపోయాడు. మొదటి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 477 పరుగులు చేసింది. మొయిన్ అలీ 146 పరుగులు కొట్టాడు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 759/7 రికార్డు స్కోరు సాధించింది. అయిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన కొత్త ఆటగాడు కరుణ్‌ నాయర్‌ పరుగుల వరద పారించాడు. 309 పరుగులు చేసి భారత్ తరపున మూడో ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. నాయర్‌తో పాటు కేఎల్‌ రాహుల్ చెలరేగి ఆడి 199 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 207 పరుగులకే ఆలౌటవ్వడంతో భారత్ ఇన్నింగ్స్‌ 75 పరుగుల తేడాతో గెలిచింది.

2016 తర్వాత భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ ఎవరూ చేయలేదు. ప్రస్తుత జట్టులో విశేష ప్రతిభ కలిగిన ఆటగాళ్ళుండడం, చెపాక్ స్టేడియం భారత్ జట్టుకు అచ్చొచ్చిన గ్రౌండ్ కావడంతో ఈసారి జరిగే రెండు టెస్టుల్లో కనీసం ఒక్కటైనా ట్రిపుల్ సెంచరీ నమోదవుతుందని టీమిండియా అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుత భారత జట్టులో స్టార్‌ బ్యాట్స్‌మన్‌కు కొదవలేదు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె సీనియర్‌ ఆటగాళ్లతో పాటు కేఎల్ రాహుల్‌, శుభమన్ గిల్‌, మయాంక్‌‌ అగర్వాల్, రిషబ్ పంత్‌ వంటి యువ ఆటగాళ్లు ఉన్నారు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ రికార్డుల పరంపరలో ట్రిపుల్ సెంచరీకి కొరత వుంది. టీమిండియా తరపున ఎన్నో రికార్డులు సృష్టించి 2013లో రిటైర్ అయిన సచిన్ టెండుల్కర్‌ కెరీర్‌లో కూడా ట్రిపుల్ సెంచరీ లేదు. రికార్డుల పరంపరతో దూకుడు మీదున్న విరాట్ కొహ్లీ ట్రిపుల్ సెంచరీల విషయంలో సచిన్‌పై పైచేయి సాధిస్తాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు రోహిత్ శర్మ ప్రతిభను తక్కువ అంఛనా వేయలేం. వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అసాధ్యమనుకున్న డబుల్ సెంచరీలను అవలీలగా కొట్టేసిన రోహిత్.. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేయగల సత్తా వున్న వాడే. సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడడం ద్వారా రాహుల్ ద్రవిడ్‌కు నిజమైన వారసునిగా కీర్తింపబడుతున్న పుజారాకు ట్రిపుల్ సెంచరీ చేసే సత్తా వుందనే చెప్పాలి. గతంలో (2016 చెన్నై టెస్టులో 199 పరుగులు చేశాడు) ఒక్క పరుగుతో టెస్టుల్లో డబుల్ సెంచరీని మిస్సయిన కేఎల్ రాహుల్ కూడా ట్రిపుల్ సెంచరీపై కన్నేశాడనే చెప్పాలి.

వీరితో పాటు ఇటీవల జట్టులో సంచలనాలు నమోదు చేస్తున్న అజింక్య రహానే, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్ వంటి సంచనాలను సృష్టించగలిగే బ్యాట్స్‌మెన్‌తో టీమిండియా దూకుడు మీద కనిపిస్తోంది.. మరోవైపు ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక విజయం సాధించిన ఆత్మవిశ్వాసం, సొంతగడ్డపై ఎన్నో నెలల విరామం అనంతరం ఆడుతున్న ఉత్సాహంతో.. టీమిండియా బరిలోకి దిగుతోంది. అంతేగాక ఇంగ్లాండ్‌తో తొలి రెండు టెస్టులు చెపాక్ స్టేడియంలోనే జరగనున్నాయి. సుమారు 15 రోజుల పాటు టీమిండియా చెన్నైలోనే వుండబోతోంది. అలవాటయ్యే పిచ్, ఘనమైన రికార్డులను అందించిన స్టేడియం కావడంతో టీమిండియా రికార్డులను బద్దలు కొడుతుందని క్రికెట్ పండితులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ సెంచరీ రికార్డును భారత బ్యాట్స్‌మెన్‌ అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు.

Also read: మయన్మార్‌లో అసలేం జరిగింది? సైనిక తిరుగుబాటు వెనుక రహస్యమేంటి?