Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు ప్రపంచకప్‌లు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఓటమికి గల కారణాలపై ఆయన మాట్లాడుతూ, ఈ టీమిండియా ఆల్ రౌండర్ పై తీవ్రంగా విరుచుకపడ్డాడు. సోమవారం ఒక ఫాంటసీ యాప్‌తో 60 ఏళ్ల శాస్త్రి మాట్లాడుతూ, బౌలింగ్ చేయగల టాప్-6లో ఉన్న ఆటగాడు నాకు ఎప్పుడూ కావాలి. కానీ, హార్దిక్ గాయం కారణంగా నేను ఇబ్బందుల్లో పడ్డానంటూ చెప్పుకొచ్చాడు.
రెండు ప్రపంచ కప్ ఓటములకు పాండ్యా గాయమే కారణం అయింది. దాంతో మేం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు నాకు బౌలింగ్ చేయగల టాప్-6లో ఎవరూ లేరు. ఇలాంటి వారిని వెతకమని సెలక్టర్లకు కూడా చెప్పాను. కానీ అప్పుడు ఎవరూ వినలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
శాస్త్రి కోచింగ్‌లో టీం ఇండియా ఆస్ట్రేలియాలో రెండు సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. అంతేకాదు టెస్ట్‌లో నంబర్-1 ర్యాంక్‌ను కూడా సాధించింది. అయితే టీమ్‌ఇండియా ప్రపంచకప్ గెలిపించడంలో మాత్రం విఫలవయ్యాడు. అలాగే తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ జట్టుకు కోచ్‌గా ఉన్న ఘనతను కూడా కోల్పోయాడు.
గాయం నుంచి తిరిగొచ్చిన పాండ్యా..
హార్దిక్ గాయం నుంచి కోలుకున్న తర్వాత IPL చివరి సీజన్‌లో బలమైన పునరాగమనం చేశాడు. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. పాండ్యా తొలి సీజన్‌లోనే గుజరాత్ టైటాన్స్‌ను చాంపియన్‌గా మార్చాడు.
2018 ఆసియా కప్‌లో గాయపడిన పాండ్యా..
2018 ఆసియా కప్‌లో హార్దిక్ పాండ్యా వెన్ను గాయానికి గురయ్యాడు. ఆ తర్వాత వరుసగా మూడేళ్లపాటు వెన్ను గాయంతో ఇబ్బంది పడ్డాడు. ఇది మాత్రమే కాదు, పాండ్యా కోలుకోవడం కోసం 2021 T20 ప్రపంచ కప్ ఎంపిక ప్రక్రియలో అందుబాటులో లేకుండా పోయాడు.