
Smriti Mandhana Father Dancing: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన ఇంట జరగాల్సిన పెళ్లి వేడుకల్లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. సంగీత్ వేడుకలో ఎంతో ఉత్సాహంగా కూతురితో కలిసి డ్యాన్స్ చేసిన ఆమె తండ్రి, మరుసటి రోజే గుండెపోటుకు గురవడం అందరినీ కలచివేస్తోంది.
వైరల్ వీడియోలో ఏముంది..?
స్మృతి మంధాన వివాహం మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో నవంబర్ 23న జరగాల్సి ఉంది. దీనికి ముందు రోజు (శనివారం) రాత్రి ఘనంగా సంగీత్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన ఎంతో ఆనందంగా కనిపించారు. ఆయన తన కూతురితో కలిసి ‘దేశీ గర్ల్’, ‘నా రే నా రే’ వంటి పాటలకు హుషారుగా స్టెప్పులేశారు. ఆ ఆనంద క్షణాలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఆయన ఎంతో ఆరోగ్యంగా, సంతోషంగా కనిపించడం చూసి నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగింది..?
సంగీత్ వేడుక ముగిసిన తర్వాత, సరిగ్గా పెళ్లి జరగాల్సిన రోజు (ఆదివారం) ఉదయం అల్పాహారం తీసుకుంటుండగా శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను సాంగ్లీలోని సర్వహిత్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం ఆయనకు గుండెపోటు లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
పెళ్లి వాయిదా..
తండ్రి అనారోగ్యం కారణంగా స్మృతి మంధాన తన వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేశారు. “నాన్న పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి జరగదు” అని ఆమె స్పష్టం చేసినట్లు మేనేజర్ తెలిపారు. అలాగే, పెళ్లికి సంబంధించిన పోస్టులను కూడా ఆమె సోషల్ మీడియా నుంచి తొలగించారు. పెళ్లి పీటల మీద కూర్చోవాల్సిన సమయంలో తండ్రి ఆసుపత్రి పాలవడంతో మంధాన కుటుంబంలో ఆందోళన నెలకొంది. ఆయన త్వరగా కోలుకోవాలని క్రికెట్ అభిమానులు, ప్రముఖులు కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..