IND vs AFG: ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గానీ.. మన టీమ్ ప్రపంచ రికార్డ్ బద్ధలు కొట్టిందని తెలుసా?

టీమిండియా ఆఫ్ఘనిస్తాన్‌పై ఏకైక టెస్టును ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో గెలిచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ విజయంతో, అన్ని ఫార్మాట్లలో ఆఫ్ఘనిస్తాన్‌పై ఓటమి లేకుండా 15 మ్యాచ్‌లు పూర్తి చేసింది. న్యూజిలాండ్ రికార్డును అధిగమించి, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అజేయ పరంపర సాధించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది.

IND vs AFG: ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు గానీ.. మన టీమ్ ప్రపంచ రికార్డ్ బద్ధలు కొట్టిందని తెలుసా?
Ind Vs Afg

Updated on: Jun 09, 2026 | 10:40 AM

పసికూన ఆఫ్ఘనిస్తాన్‌‌తో జరిగిన ఏకైక టెస్టును టీమిండియా మూడు రోజుల్లోనే ముగించింది. అయితే ఈ మ్యాచ్‌పై క్రికెట్ అభిమానులు పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. భారత జట్టు అరుదైన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. సోమవారం న్యూ చండీగఢ్‌లో జరిగిన ఏకైక టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 300 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో అన్ని ఫార్మాట్లలో కలిపి ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ ఓటమి లేకుండా 15 మ్యాచ్‌లు పూర్తి చేసి, ఒకే ప్రత్యర్థిపై అత్యధిక అజేయ పరంపర కొనసాగించిన ప్రపంచంలోని తొలి జట్టుగా నిలిచింది.

2010 నుంచి ఇప్పటివరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య 15 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో భారత్ 12 మ్యాచ్‌లు గెలిచింది. రెండు మ్యాచ్‌లు టై కాగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం లేకుండా ముగిసింది. ఓటమి మాత్రం ఒక్కటీ ఎదురుకాలేదు. దీంతో న్యూజిలాండ్‌ పేరిట ఉన్న ఐర్లాండ్‌పై 13 మ్యాచ్‌ల అజేయ రికార్డును భారత్ అధిగమించింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బౌలింగ్‌లోనూ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అరంగేట్రం చేసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతార్ అద్భుత ప్రదర్శనతో తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్‌ను కేవలం 152 పరుగులకే కట్టడి చేశాడు.

ఫాలోఆన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో కూడా భారత బౌలర్లను ఎదుర్కోలేక 112 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి పతనాన్ని వేగవంతం చేశారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ మరియు 300 పరుగుల భారీ తేడాతో విజయాన్ని నమోదు చేసింది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన రెండు టై మ్యాచ్‌లు కూడా అభిమానులకు గుర్తుండిపోయేవే. 2018 ఆసియా కప్‌లో జరిగిన వన్డే టై కాగా, 2024లో బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రింకు సింగ్ వీరోచిత బ్యాటింగ్‌తో భారత్‌ను కాపాడగా, చివరకు రవి బిష్ణోయ్ బౌలింగ్‌తో విజయం సాధించింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌పై 15 మ్యాచ్‌ల అజేయ రికార్డుతో అగ్రస్థానంలో ఉన్న భారత్, ఈ నెల చివర్లో ఐర్లాండ్ పర్యటనకు సిద్ధమవుతోంది. ఐర్లాండ్‌పై కూడా టీమిండియాకు 11 మ్యాచ్‌ల అజేయ పరంపర కొనసాగుతుండటం విశేషం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us