Video: 20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. 74 బంతుల్లో దుమ్మురేపిన బుడ్డోడు.. ఎవరో తెలుసా?

Tanmay chaudhary: భారత క్రికెట్ ప్రతిభలో పెరుగుదల కనిపిస్తోంది. అలాంటి ఒక క్రికెటర్ ఢిల్లీలో అసాధారణ ప్రదర్శన ఇచ్చాడు. తన్మయ్ చౌదరి ఒక టీ20 మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించాడు. ఇంకా, అతని జట్టు కెప్టెన్ వరుణ్ శర్మ కూడా కేవలం 28 బంతుల్లో 112 పరుగులు చేశాడు.

Video: 20 సిక్సర్లు, 24 ఫోర్లతో డబుల్ సెంచరీ.. 74 బంతుల్లో దుమ్మురేపిన బుడ్డోడు.. ఎవరో తెలుసా?
Tanmay Chaudhary

Updated on: Dec 18, 2025 | 8:20 AM

Tanmay chaudhary: ఐపీఎల్ 2026 వేలంలో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లను కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఢిల్లీలో డీసీ స్కూల్ కప్‌ను నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్‌లో ఇద్దరు ఆటగాళ్ళు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ది ఇండియన్ స్కూల్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో బరాఖంబా స్కూల్ ఆఫ్ ఢిల్లీ జట్టు 394 పరుగులు చేసింది. బరాఖంబా స్కూల్‌కు చెందిన ఓపెనర్ తన్మయ్ చౌదరి కేవలం 74 బంతుల్లో 228 పరుగులు చేశాడు. ఈ ఆటగాడి స్ట్రైక్ రేట్ 308.1గా నిలిచింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తన్మయ్ చౌదరి తన 74 బంతుల ఇన్నింగ్స్‌లో 43 బంతుల్లో ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. తన్మయ్ తన ఇన్నింగ్స్‌లో 20 సిక్సర్లు బాదాడు.

వరుణ్ శర్మ విధ్వంసం..

తన్మయ్ మాత్రమే కాదు, బరాఖంబా స్కూల్ కెప్టెన్ వరుణ్ శర్మ కూడా తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఈ ఆటగాడు 28 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 13 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. ఈ ఆటగాడి స్ట్రైక్ రేట్ 400గా నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వరుణ్, తన్మయ్ ఇన్నింగ్స్ వీడియోను షేర్ చేసింది. వరుణ్, తన్మయ్ ది ఇండియన్ స్కూల్ బౌలర్లను చిత్తు చేశారు. అయం మండల్ ఒక ఓవర్‌లో 42 పరుగులు ఇచ్చాడు. రుహాన్ బిష్ట్ 3 ఓవర్లలో 70 పరుగులు ఇచ్చాడు. ఉత్కర్ష్ 3 ఓవర్లలో 66 పరుగులు ఇచ్చాడు. అర్జున్ తారా 4 ఓవర్లలో 75 పరుగులు ఇచ్చాడు.

బారాఖంబా స్కూల్ (Barakhamba School) వర్సెస్ ది ఇండియన్ స్కూల్ (The Indian School) తలపడ్డాయి. తన్మయ్ విధ్వంసానికి తోడు, కెప్టెన్ వరుణ్ శర్మ కూడా 28 బంతుల్లోనే 112 పరుగులు (13 సిక్సర్లు, 6 ఫోర్లు) చేయడంతో బారాఖంబా స్కూల్ నిర్ణీత 20 ఓవర్లలో 394 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ‘ది ఇండియన్ స్కూల్’ జట్టు కేవలం 27 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో ఆరుగురు బ్యాటర్లు సున్నాకే వెనుదిరిగారు. దీంతో బారాఖంబా స్కూల్ 367 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఈ అద్భుతమైన ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఒక యువ ఆటగాడు టీ20ల్లో ఈ స్థాయిలో రాణించడంపై క్రికెట్ వర్గాల్లో ప్రశంసలు కురుస్తున్నాయి.