
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026కు రంగం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. ఇప్పటికే టీమిండియా తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించగా, ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మౌంటీ పనేసర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సెమీఫైనల్‌కు చేరే జట్లతో పాటు, భారత జట్టు తదుపరి కెప్టెన్‌పై కూడా ఆయన సంచలన అంచనాలు వేశారు. మౌంటీ పనేసర్ అంచనా ప్రకారం.. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. “భారత్ దక్షిణాఫ్రికా జట్లు ప్రస్తుతం చాలా బలంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద జట్లను ఓడించే సత్తా ఉంది. ఆస్ట్రేలియా ఎప్పుడూ ప్రమాదకరమే. అయితే న్యూజిలాండ్ ఈసారి అంత ప్రభావం చూపకపోవచ్చు” అని పనేసర్ విశ్లేషించారు.
ప్రస్తుత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 2025లో గడ్డుకాలాన్ని ఎదుర్కొన్నారు. గత 19 ఇన్నింగ్స్‌ల్లో ఆయన సగటు కేవలం 13.62 మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయినప్పటికీ పనేసర్ ఒక షాకింగ్ అంచనా వేశారు. ఈ వరల్డ్ కప్‌లో సూర్యకుమార్ ఫామ్‌లోకి రావడమే కాకుండా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకుంటారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత రికార్డులు సూర్యకు అనుకూలంగా ఉన్నాయని, ప్రపంచకప్ లాంటి పెద్ద వేదికపై ఆయన సత్తా చాటుతారని పనేసర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవేళ సూర్యకుమార్ నాయకత్వంలో భారత్ ప్రపంచకప్ గెలవలేకపోతే, తదుపరి కెప్టెన్ బాధ్యతలు అక్షర్ పటేల్కు దక్కుతాయని పనేసర్ జోస్యం చెప్పారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఆల్‌రౌండర్లు అంటే చాలా ఇష్టమని, బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించగల అక్షర్ పటేల్ జట్టుకు సరైన నాయకుడు అవుతారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే వరల్డ్ కప్ జట్టుకు అక్షర్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడం ఈ దిశగా వేసిన తొలి అడుగుగా పనేసర్ భావిస్తున్నారు.
భారత జట్టు ఎంపికలో గంభీర్ తన మార్క్ చూపించారని పనేసర్ ప్రశంసించారు. ఫామ్ లేని కారణంగా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను తప్పించి, డొమెస్టిక్ క్రికెట్‌లో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమని కొనియాడారు. “ఎంత పెద్ద ఆటగాడైనా ఫామ్ లేకపోతే జట్టులో చోటు ఉండదు అనే బలమైన సందేశాన్ని గంభీర్ పంపారు” అని పనేసర్ వ్యాఖ్యానించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..