
టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 7న మెగా ఈవెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, క్రికెట్ అభిమానులలో ఉత్సాహం పెరుగుతోంది. ఈ టోర్నీలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ లాంటి బలమైన జట్లపైనా భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ20 క్రికెట్‌లో ఏ జట్టును తేలిగ్గా అంచనా వేయలేమని మాజీ క్రికెటర్లు ఓవర్ కాన్ఫిడెన్స్‌కు పోకుండా పక్కా ప్రణాళికతో ఆడాలని సూచిస్తున్నారు.
ఈసారి భారత్ ఆతిథ్యం ఇస్తున్నందున ప్రపంచకప్ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ టోర్నీలో 300కు పైగా స్కోర్లు నమోదైనా ఆశ్చర్యపోనక్కర్లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టీ20 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు 300 పరుగులు సాధించే సత్తా కలిగి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రెండు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారని, టాప్ ఆర్డర్‌లో బ్యాటర్లు శతకాలు నమోదు చేస్తే 300 మార్కును అందుకోవడం కష్టమేమీ కాదని రవిశాస్త్రి స్పష్టం చేశారు.
నిజానికి ఆస్ట్రేలియా, టీమిండియా రెండు జట్లు బలంగానే ఉన్నాయి. అయితే, స్వదేశంలో ఆడటం టీమిండియాకు అదనపు ప్రయోజనమని చెప్పాలి. భారత జట్టు బ్యాటింగ్ లోతును కలిగి ఉంది. బౌలింగ్ విభాగంలోనూ బలంగా కనిపిస్తోంది. టీ20 ప్రపంచకప్‌కు ముందు కావాల్సినంత మ్యాచ్ ప్రాక్టీస్ కూడా టీమిండియాకు లభించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్నందున కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించగలిగితే టీమిండియాకు తిరుగుండదు. ఫీల్డింగ్‌లో పొరపాట్లు చేయకుండా సరైన ప్రణాళికతో ఆడితే, భారత్ బ్యాక్ టు బ్యాక్ టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా నిలుస్తుంది.
ఆస్ట్రేలియా జట్టు లైనప్ కూడా పటిష్టంగా ఉంది. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, మిచెల్ మార్ష్, కామెరూన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్ వంటి ఆటగాళ్లతో ఆసీస్ బ్యాటింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. అందుకే రవిశాస్త్రి భారత్, ఆస్ట్రేలియాకు 300 పరుగులు సాధించే సత్తా ఉందని నొక్కిచెప్పారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఏ జట్టు రికార్డులు క్రియేట్ చేస్తుందనేది ఆసక్తి రేపుతోంది.
ఇది చదవండి: కోహ్లీ బౌలర్ అయ్యింటే ఇతడిలా ఉండేవాడేమో.! ఈ యాంగ్రీ ప్లేయర్ ఎవరంటే.?
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..