Cricket Records : ఒకే మ్యాచ్.. ముగ్గురు మొనగాళ్లు.. అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ

Cricket Records : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలతో దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ సేన, ఇప్పుడు సూపర్-8 సమరానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 22, ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో తలపడనుంది.

Cricket Records : ఒకే మ్యాచ్.. ముగ్గురు మొనగాళ్లు.. అశ్విన్‌ను దాటేందుకు బుమ్రా, అర్ష్‌దీప్, హార్దిక్ రెడీ
Cricket Records

Updated on: Feb 21, 2026 | 3:42 PM

Cricket Records : టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. లీగ్ స్టేజ్‌లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ వరుస విజయాలతో దూసుకుపోయిన సూర్యకుమార్ యాదవ్ సేన, ఇప్పుడు సూపర్-8 సమరానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 22, ఆదివారం నాడు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సౌతాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ కేవలం భారత్ విజయానికే కాదు, ముగ్గురు స్టార్ బౌలర్ల వ్యక్తిగత రికార్డులకు కూడా చాలా కీలకం కానుంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.

టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అశ్విన్ 24 మ్యాచ్‌ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్ చేసే రేసులో ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు.

జస్ప్రీత్ బుమ్రా: 21 మ్యాచ్‌ల్లో 30 వికెట్లు తీశాడు. అశ్విన్‌ను మించిపోవాలంటే ఇతనికి మరో 3 వికెట్లు కావాలి.

అర్ష్‌దీప్ సింగ్: కేవలం 17 మ్యాచ్‌ల్లోనే 30 వికెట్లు పడగొట్టి బుమ్రా సరసన నిలిచాడు. ఇతనికి కూడా 3 వికెట్లు దక్కితే టీమిండియా టాప్ వికెట్ టేకర్ అవుతాడు.

హార్దిక్ పాండ్యా: 28 మ్యాచ్‌ల్లో 29 వికెట్లు తీసిన పాండ్యాకు మరో 4 వికెట్లు దక్కితే అశ్విన్‌ రికార్డు బద్దలవుతుంది.

బుమ్రా వర్సెస్ అర్ష్‌దీప్ వికెట్ల వేటలో ఎవరు ముందు?

ప్రస్తుత గణాంకాలను పరిశీలిస్తే బుమ్రా ఎకానమీ రేటు (5.50) అత్యద్భుతంగా ఉంది. కానీ అర్ష్‌దీప్ సింగ్ చాలా తక్కువ మ్యాచ్‌ల్లోనే (17) 30 వికెట్లు తీయడం విశేషం. ఆదివారం జరగబోయే మ్యాచ్‌లో వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. ఎవరు ముందుగా ఆ 3 వికెట్లు తీసి చరిత్ర సృష్టిస్తారో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండర్‌గా రాణిస్తూనే వికెట్ల వేటలోనూ వెనకడుగు వేయడం లేదు.

భారత్ విజయ పరంపర.. సఫారీలకు సవాల్

లీగ్ దశలో అమెరికాపై 29 పరుగులు, నమీబియాపై ఘనవిజయం, పాకిస్థాన్‌పై 61 పరుగులు, నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా గ్రూప్-A టాపర్‌గా నిలిచింది. సౌతాఫ్రికా కోచ్ శుక్రి కాన్రాడ్ భారత్ బలహీనతలను బయటపెడతామని హెచ్చరించినప్పటికీ, ప్రస్తుత ఫామ్ చూస్తుంటే భారత బౌలింగ్ త్రయం సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సొంత గడ్డ అహ్మదాబాద్‌లో ఈ రికార్డులు నమోదవడం ప్రత్యేకతను సంతరించుకోనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us