T20 World Cup 2026: కొత్త డ్రామా మొదలెట్టేసిన బంగ్లాదేశ్.. వింత డిమాండ్‌తో ఐసీసీ ముందుకు..

T20 World Cup 2026: భారత్‌లో మ్యాచ్‌లు ఆడకూడదనే బంగ్లాదేశ్ మొండి పట్టుదలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆతిథ్య దేశంలో ఆడలేమన్నప్పుడు టోర్నీ నుంచి తప్పుకోవాలని కొందరు సూచిస్తుండగా, ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మరికొందరు విమర్శిస్తున్నారు. ఈ వివాదం చివరకు ఎటు దారితీస్తుందో వేచి చూడాలి.

T20 World Cup 2026: కొత్త డ్రామా మొదలెట్టేసిన బంగ్లాదేశ్.. వింత డిమాండ్‌తో ఐసీసీ ముందుకు..
India Vs Bangladesh Cricket Controversy

Updated on: Jan 18, 2026 | 7:01 AM

T20 World Cup 2026: వచ్చే నెలలో భారత్ వర్సెస్ శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) మరోసారి వివాదానికి తెరలేపింది. తమ జట్టు మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించవద్దని, తమను ఐర్లాండ్ గ్రూప్‌లోకి మార్చాలని ఐసీసీని కోరుతూ వింత ప్రతిపాదన చేసింది. ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ ఉదంతం తర్వాత భారత్‌పై అసహనంతో ఉన్న బంగ్లాదేశ్, ఇప్పుడు భద్రతా కారణాలను సాకుగా చూపుతోంది.

టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్ ఖరారవుతున్న తరుణంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఢాకాలో ఐసీసీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో బీసీబీ ఒక అనూహ్య ప్రతిపాదనను ఉంచింది. తాము ఉన్న గ్రూప్ నుంచి తమను ఐర్లాండ్ ఉన్న గ్రూప్‌లోకి మార్చాలని (Group Swap), తద్వారా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలో జరిగేలా చూడాలని కోరింది.

అసలు వివాదం ఏమిటి?

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించినప్పటి నుంచి బీసీబీ భారత్‌పై గుర్రుగా ఉంది. దీనికి తోడు రాజకీయ, భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో మ్యాచ్‌లు ఆడటానికి విముఖత ప్రదర్శిస్తోంది. నిజానికి బంగ్లాదేశ్ ప్రస్తుతం ‘గ్రూప్ C’ లో ఉంది. వీరి మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబైలో జరగాల్సి ఉంది. వెస్టిండీస్, ఇంగ్లాండ్ వంటి జట్లతో ఆ జట్టు తలపడాల్సి ఉంది.

బీసీబీ ప్రతిపాదన ఇదీ: ఐర్లాండ్ ప్రస్తుతం ‘గ్రూప్ B’ లో ఉంది. ఈ గ్రూప్ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోని కొలంబో, క్యాండీ వేదికలుగా జరగనున్నాయి. బంగ్లాదేశ్ బోర్డు కోరుకున్నట్లుగా ఐర్లాండ్‌తో గ్రూప్ స్వైప్ జరిగితే, బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రానక్కర్లేదు. కానీ, ఈ ప్రతిపాదనను ఐర్లాండ్ క్రికెట్ బోర్డు, ఐసీసీ అంగీకరించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

ఐసీసీ స్పందన: వార్తల ప్రకారం, ఐర్లాండ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ నుంచి కొన్ని హామీలు లభించాయి. ఎవరినీ బలవంతంగా గ్రూప్ మార్చబోమని, ఐర్లాండ్ మ్యాచ్‌లు ముందుగా నిర్ణయించినట్లు శ్రీలంకలోనే జరుగుతాయని స్పష్టం చేసినట్లు సమాచారం. మెగా టోర్నమెంట్ నిర్వహణలో ఇలాంటి లాజిస్టికల్ మార్పులు చేయడం ఐసీసీకి పెను సవాలుగా మారుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..