
T20 World Cup 2026 : భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. 2023 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని అద్భుతమైన టీమ్ వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి, అహ్మదాబాద్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు సరిగ్గా అదే చోట వచ్చే ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో కూడా ఆస్ట్రేలియాతోనే తలపడాలని తాను కోరుకుంటున్నట్లు సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గతం మర్చిపోకుండా పగ తీర్చుకోవాలనే లక్ష్యం భారత ఆటగాళ్లలో ఇంకా బలంగా ఉందని ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
మంగళవారం జరిగిన ప్రకటనలో 2026 టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన గ్రూపుల వివరాలు వెల్లడయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న భారత్‌ను పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియాతో కలిపి గ్రూప్ Aలో ఉంచారు. మరోవైపు, ఆస్ట్రేలియా టీమ్‌ను శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్తో కూడిన గ్రూప్ Bలో చేర్చారు. ఈ గ్రూపుల ప్రకటనతో పాటు టోర్నమెంట్‌కు సంబంధించిన వేదికలు, మ్యాచ్ షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
సూర్యకుమార్ యాదవ్‌ను వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఏ జట్టుతో తలపడాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా, ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా “అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం, ఆస్ట్రేలియా” అని సమాధానం ఇచ్చారు. 2023 ఫైనల్ ఓటమి భారత ఆటగాళ్ల మనసుల్లో ఎంత బలంగా ఉందో ఈ సమాధానం ద్వారా అర్థమవుతోంది. గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం కోసం వారు ఎదురుచూస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ మాటలకు భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మద్దతు పలికారు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్ సెమీ-ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత జట్టు ఆస్ట్రేలియాను ఓడించి, ఆ తర్వాత టైటిల్ గెలుచుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆస్ట్రేలియానే మాకు ఇష్టమైన ప్రత్యర్థి. మేము ఎవరినైనా ఓడించాలనుకుంటే, అది ఆస్ట్రేలియా మాత్రమే. ఎందుకంటే, అలాంటి ఆటలే మనకు ఎక్కువ కాలం గుర్తుండిపోతాయని ఆమె చెప్పారు. గతంలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించినా, ప్రపంచ కప్ ఫైనల్ ఓటమి మాత్రం వారికి ఒక సవాలుగా నిలిచింది.