
Surya kumar Yadav : టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్‌తో జరగనున్న ఐదో టీ20 మ్యాచ్, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం మరో 33 పరుగులు చేస్తే, టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని చేరుకుంటాడు. తద్వారా ప్రపంచ క్రికెట్‌లో నెంబర్ 12 ప్లేయర్‌గా రికార్డు సృష్టించే అవకాశం సూర్య ముందు ఉంది.
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు టీమిండియాకు ఇదే చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 103 టీ20 మ్యాచ్‌ల్లో 97 ఇన్నింగ్స్‌లు ఆడి 2,967 పరుగులు చేశాడు. తిరువనంతపురంలో జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో అతను మరో 33 పరుగులు చేస్తే, టీ20 ఫార్మాట్‌లో 3000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోని 12వ ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ఈ ఘనత సాధించిన మూడో భారతీయ క్రికెటర్‌గా కూడా నిలుస్తాడు. గతంలో రోహిత్ శర్మ (4,231 పరుగులు), విరాట్ కోహ్లీ (4,188 పరుగులు) మాత్రమే భారత్ తరపున ఈ ఫీట్ సాధించారు. ప్రస్తుతం పాకిస్థాన్ స్టార్ బాబర్ ఆజం 4,453 పరుగులతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
కేవలం సూర్య మాత్రమే కాదు, న్యూజిలాండ్ ఆటగాళ్లు కూడా ఈ మ్యాచ్‌లో కొన్ని రికార్డులపై కన్నేశారు. గత మ్యాచ్‌లో అదరగొట్టిన కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్, టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేసుకోవడానికి 52 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేళ అతను ఈ ఘనత సాధిస్తే, ఈ మైలురాయిని చేరిన నాలుగో న్యూజిలాండ్ ప్లేయర్‌గా నిలుస్తాడు. ఇక బౌలింగ్ విభాగంలో ఈష్ సోధికి ఒక అద్భుత అవకాశం ఉంది. కివీస్ లెజెండరీ బౌలర్ టిమ్ సౌథీ పేరిట ఉన్న 164 వికెట్ల రికార్డును అధిగమించాలంటే సోధికి కేవలం మరో 3 వికెట్లు కావాలి.
ఈ మ్యాచ్ కేవలం రికార్డుల కోసమే కాదు, వరల్డ్ కప్ ముందు టీమ్ కాంబినేషన్లను పరీక్షించుకోవడానికి కూడా భారత్‌కు ఒక గొప్ప అవకాశం. తిరువనంతపురంలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో సూర్యకుమార్ యాదవ్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడే అవకాశం ఉంది. వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీకి వెళ్లే ముందు కెప్టెన్ ఇలాంటి భారీ మైలురాయిని అందుకోవడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. ఒకవేళ సూర్య ఈ 33 పరుగులు చేస్తే, అతను అత్యంత వేగంగా (ఇన్నింగ్స్‌ల పరంగా) 3000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు సంపాదించే అవకాశం ఉంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..