
IND vs IRE : టీ20 ప్రపంచకప్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత జట్టుకు ఐర్లాండ్ పర్యటన ఒక పెద్ద పీడకలగా మారింది. పసికూన ఐర్లాండ్‌ను చాలా సులువుగా ఓడించవచ్చని భావించిన శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియాకు అక్కడ గట్టి షాక్ తగిలింది. రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్‌స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే మొదటి సిరీస్ కాగా, తొలి ప్రయత్నంలోనే అతడు దారుణంగా విఫలమయ్యాడు. ఈ ఘోర పరాజయంపై భారత బ్యాటింగ్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. భారత ఆటగాళ్ల నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ ఆయన ఒక వేకప్ కాల్ ఇచ్చారు.
భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత చేదు జ్ఞాపకం
ఈ సిరీస్ ఓటమి భారత అభిమానులతో పాటు మాజీ ఆటగాళ్లను తీవ్రంగా కలచివేసింది. స్పోర్ట్‌స్టార్‌కు రాసిన తన తాజా కాలమ్‌లో సునీల్ గవాస్కర్ తన ఆవేదనను, ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. “జూన్ 28, ఆదివారం అనేది భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన రోజుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. మ్యాచ్‌ల్లో ఓడిపోవడం సహజమే, కానీ ఎవరి చేతిలో ఓడిపోతున్నామనేది ముఖ్యం. భారత క్రికెట్‌లో నేను కూడా కొన్ని పరాజయాలను చూశాను, వాటిలో భాగమయ్యాను. కానీ ఐర్లాండ్ లాంటి జట్టు చేతిలో సిరీస్ పూర్తిగా ఓడిపోవడం అనేది మన క్రికెట్ చరిత్రలోనే అత్యంత తక్కువ స్థాయి అని చెప్పక తప్పదు” అని గవాస్కర్ చాలా ఘాటుగా విమర్శించారు.
డిఫెండింగ్ ఛాంపియన్లకు గట్టి షాక్
భారత జట్టు ఓటమికి ఐర్లాండ్ అద్భుతమైన ఆట తీరు కారణం కాదని, కేవలం భారత ఆటగాళ్లలో ఉన్న అతివిశ్వాసమే కొంపముంచిందని గవాస్కర్ విశ్లేషించారు. ఐర్లాండ్ జట్టు గనక అసాధారణ క్రికెట్ ఆడి గెలిచి ఉంటే ఈ బాధ ఇంతగా ఉండేది కాదని ఆయన అన్నారు. మైదానంలో భారత ఆటగాళ్లు చూపించిన అమితమైన నమ్మకం, మ్యాచ్‌ను తేలికగా తీసుకున్న విధానం వల్లే ఈ పరాభవం ఎదురైందని, అందుకే ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని స్పష్టం చేశారు. పసికూన జట్టు మనల్ని సులువుగా ఓడిస్తుంటే ఆటగాళ్లు ఏమాత్రం బాధ్యత లేకుండా ఆడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేజింగ్‌లో చేతులెత్తేసిన స్టార్ బ్యాటర్లు
ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో ఐర్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 182 పరుగులు చేసింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్న భారత జట్టుకు ఈ లక్ష్యం పెద్దదేమీ కాదు. కానీ మన బ్యాటింగ్ లైనప్ దారుణంగా విఫలమై కేవలం 148 పరుగులకే పరిమితమైంది. రెండో మ్యాచ్‌లోనైనా తప్పులు సరిదిద్దుకుంటారని భావిస్తే కథ మళ్లీ మొదటికే వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 154 పరుగులు చేయగా, ఒత్తిడిలో భారత్ చేతులెత్తేసింది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయి సిరీస్‌ను సమర్పించుకుంది. 2023 తర్వాత భారత్ ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ను ఓడిపోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
వరల్డ్ కప్ గెలిచామన్న అహంకారమే దెబ్బతీసిందా?
ఇటీవలే ముగిసిన 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ టోర్నీలోనూ సూపర్ 8 దశలో సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన తర్వాతే భారత్ రియాలిటీలోకి వచ్చి అద్భుతంగా ఆడి కప్పు గెలిచింది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు కూడా వరల్డ్ కప్ గెలిచామన్న అహంకారంతో ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేసినట్లు కనిపిస్తోంది. ఈ పరాజయంతోనైనా భారత జట్టు కళ్ళు తెరిచి, రాబోయే ఇంగ్లాండ్ పర్యటనలో తమ వ్యూహాలను మార్చుకుని మరింత బాధ్యతాయుతంగా ఆడాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి