IND vs WI: గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్.. కామెంట్రీ బాక్స్ నుంచే గవాస్కర్ వార్నింగ్

IND vs WI: హైదరాబాద్ టీ20లో విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ తీరుపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన అర్ష్‌దీప్ భుజాన్ని లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు. ఈ మ్యాచులో విండీస్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

IND vs WI: గాయపడిన అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా విండీస్ బౌలర్ ఓవరాక్షన్.. కామెంట్రీ బాక్స్ నుంచే గవాస్కర్ వార్నింగ్
Shamar Joseph

Updated on: Oct 15, 2026 | 10:44 AM

IND vs WI: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్ వేదికగా జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో విండీస్ పేసర్ షమర్ జోసెఫ్ ప్రవర్తించిన తీరుపై భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు. భారత టెయిలెండర్ బ్యాటర్ అర్ష్‌దీప్ సింగ్ గాయపడిన భుజాన్ని లక్ష్యంగా చేసుకుని షమర్ జోసెఫ్ వరుసగా షార్ట్ పిచ్ బంతులు విసరడంపై ఆయన బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన విండీస్ బౌలర్ తీరును కామెంట్రీ బాక్స్ నుంచి తీవ్రంగా తప్పుపట్టారు.

ఈ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లలో భారత్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అర్ష్‌దీప్ సింగ్‌ను వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ విసిరిన ఒక భీకరమైన బౌన్సర్ బలంగా తాకింది. దీంతో అర్ష్‌దీప్ భుజానికి తీవ్ర గాయమై మైదానంలోనే నొప్పితో విలవిల్లాడాడు. పరిస్థితి గమనించిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెంటనే రిటైర్డ్ హర్ట్ గా మైదానం వీడి బయటకు రావాలని సూచించారు. అయినప్పటికీ జట్టు గెలుపు కోసం నొప్పితోనే క్రీజులో నిలబడి బ్యాటింగ్ కొనసాగించాలని అర్ష్‌దీప్ నిర్ణయించుకున్నాడు.

అర్ష్‌దీప్ సింగ్ స్టంప్స్‌ను పూర్తిగా వదిలేసి షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు. దీన్ని అవకాశంగా మలుచుకున్న షమర్ జోసెఫ్.. స్టంప్స్‌కు బదులుగా సరిగ్గా అర్ష్‌దీప్ గాయపడిన భుజమే లక్ష్యంగా మరో షార్ట్ బాల్ సంధించాడు. అదృష్టవశాత్తు ఆ బంతి తగలకుండా వైడ్ రూపంలో వెళ్లినప్పటికీ, బౌలర్ వ్యవహారశైలిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. కామెంట్రీ బాక్స్‌లో ఉన్న సునీల్ గవాస్కర్ ఈ ఘటనపై మండిపడుతూ.. “స్టంప్స్ నేరుగా ఎదురుగా ఉన్నప్పుడు బ్యాటర్‌ శరీరాన్ని ఎందుకు టార్గెట్ చేయాలి? ఇది క్రీడాస్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం” అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు.

వెస్టిండీస్ బౌలర్ వేసిన తదుపరి బంతులను ఎదుర్కొనే క్రమంలో తీవ్ర నొప్పితో ఇబ్బంది పడిన అర్ష్‌దీప్ చివరికి 5 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాల్సి వచ్చింది. చివరకు వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. అయితే మ్యాచ్ ఓటమి కంటే విండీస్ బౌలర్ ప్రదర్శించిన క్రీడాస్ఫూర్తి లేమి అంశమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ అర్ష్‌దీప్ భుజం గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అక్టోబర్ 17న బెంగళూరులో జరగనున్న నిర్ణయాత్మక ఐదో టీ20కి అతడు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బగా మారే అవకాశం ఉంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us