
Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా నమీబియాతో జరగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అస్వస్థతకు గురవ్వడంతో అతని స్థానంలో ఎవరు ఆడతారనేది ఇప్పుడు హాట్ టాపిక్. సాధారణంగా సంజూ శాంసన్ పేరు వినిపిస్తున్నప్పటికీ, టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం ఒక షాకింగ్, అవుట్ ఆఫ్ ది బాక్స్ సలహా ఇచ్చారు. మాజీ కెప్టెన్ శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానెల్ చీకీ చీకాలో మాట్లాడుతూ.. సంజూ శాంసన్ ఫామ్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సంజూకు చాలా అవకాశాలు ఇచ్చామని, కానీ అతను ఏమీ నిరూపించుకోలేదని అభిప్రాయపడ్డారు. అభిషేక్ శర్మ లేని పక్షంలో సంజూ శాంసన్ కన్నా వాషింగ్టన్ సుందర్‌ను ఓపెనర్‌గా పంపాలని ఆయన సూచించారు. “నేనే గనుక కెప్టెన్ అయితే, సంజూని పక్కన పెట్టి సుందర్‌ను ఓపెనింగ్‌కు పంపుతాను. తద్వారా అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది. ఇది పాకిస్థాన్ వంటి పెద్ద మ్యాచ్‌లకు ముందే అతన్ని సిద్ధం చేస్తుంది” అని శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
భారత యువ సంచలనం అభిషేక్ శర్మ గత రెండు రోజులుగా కడుపులో ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్‌తో ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. బుధవారం సాయంత్రం ఆయన డిశ్చార్జ్ అయినప్పటికీ, నేడు నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆయన ఆడటం సందేహంగానే ఉంది. ఫిబ్రవరి 15న కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌కు అభిషేక్ అత్యవసరమని భావిస్తున్న మేనేజ్‌మెంట్, నమీబియా మ్యాచ్‌లో అతనికి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది.
గాయం కారణంగా గత కొద్దికాలంగా జట్టుకు దూరమైన వాషింగ్టన్ సుందర్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. ఇప్పటికే జట్టుతో చేరి నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. శ్రీకాంత్ ప్లాన్ ప్రకారం.. సుందర్‌ను ఓపెనర్‌గా పంపితే, అది జట్టుకు ఎక్స్‌ట్రా బౌలింగ్ ఆప్షన్‌ను కూడా ఇస్తుంది. ఒకవేళ అభిషేక్ శర్మ పాకిస్థాన్ మ్యాచ్ నాటికి తిరిగి వస్తే, సుందర్‌ను ఎనిమిదో స్థానానికి పంపి రింకూ సింగ్‌ను తప్పించాలని కూడా శ్రీకాంత్ ఒక వివాదాస్పద సూచన చేశారు.
శ్రీకాంత్ విమర్శలు ఎలా ఉన్నా, మేనేజ్‌మెంట్ మాత్రం సంజూ శాంసన్‌కే ఓటు వేసే అవకాశం ఉంది. అయితే, ఇది సంజూకు డూ ఆర్ డై లాంటి అవకాశం. న్యూజిలాండ్ సిరీస్‌లో కేవలం 9.20 సగటుతో పరుగులు చేసిన సంజూ, ఈ అవకాశాన్ని గనుక జారవిడుచుకుంటే వరల్డ్ కప్ జట్టులో తన స్థానాన్ని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే ఫిఫ్టీలతో ఫామ్‌లో ఉండటం సంజూకు మరింత ఒత్తిడిని కలిగిస్తోంది.