
Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 సీజన్ కౌంట్‌డౌన్ మొదలైన వేళ, ఆరెంజ్ ఆర్మీ తన అసలైన ప్రతాపాన్ని చూపిస్తోంది. శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎస్ఆర్ హెచ్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. గతేడాది రికార్డు స్కోర్లతో సంచలనం సృష్టించిన హైదరాబాద్, ఈసారి కూడా అదే దూకుడును కొనసాగించబోతున్నామని ప్రాక్టీస్ ద్వారానే స్పష్టం చేసింది.
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన పేరు సలీల్ అరోరా. పంజాబ్‌కు చెందిన ఈ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్, క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తన ఇన్నింగ్స్ మధ్యలో ఒక బౌలర్‌ను టార్గెట్ చేస్తూ ఏకంగా 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది తన పవర్‌ను చాటుకున్నాడు. ఐపీఎల్ 2026 వేలంలో రూ. 1.50 కోట్లకు అమ్ముడైన ఈ యువ ఆటగాడు, తనపై మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.
WILDFIRE has a 🆕 name 🔥😍 pic.twitter.com/IUIKnHNUS5
— SunRisers Hyderabad (@SunRisers) March 21, 2026
మరోవైపు స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన ఫామ్‌ను కొనసాగిస్తూ విధ్వంసం సృష్టించాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు చేసి స్టేడియం నలుమూలలా షాట్లు బాదాడు. దురదృష్టవశాత్తు ఆరు పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నప్పటికీ, పవర్ ప్లేలో అతను ఆడిన షాట్లు రాబోయే సీజన్‌లో ప్రత్యర్థి జట్లకు హెచ్చరికగా మారాయి.
పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో జట్టును నడిపించనున్న ఇషాన్ కిషన్ కూడా తన సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 25 బంతుల్లోనే 72 పరుగులు చేసి తానొక టీ20 స్పెషలిస్ట్ అని నిరూపించుకున్నాడు. ఇక హెన్రిచ్ గ్లాసెన్ 31 బంతుల్లో 49 పరుగులు చేయగా, చివర్లో హర్ష దుబే 14 బంతుల్లోనే 37 పరుగులు చేసి ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించాడు. ఈ భారీ స్కోర్లు చూస్తుంటే ఐపీఎల్ 2026లో ఆరెంజ్ ఆర్మీ మరోసారి చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..