
Sourav Ganguly : టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్.. ఈ ఇద్దరూ భారత క్రికెట్ చరిత్రలో ధృవతారలు. అయితే ఒకానొక దశలో ది వాల్ రాహుల్ ద్రవిడ్ వన్డే కెరీర్ ప్రమాదంలో పడిందని, సెలక్టర్లు అతడిని జట్టు నుంచి తీసేయాలని ఒత్తిడి చేశారని గంగూలీ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన గంగూలీ.. ద్రవిడ్ వన్డే కెరీర్‌ను కాపాడటానికి తాను సెలక్టర్లతో ఎలా పోరాడాల్సి వచ్చిందో వివరించారు. ద్రవిడ్ స్ట్రైక్ రేట్ బాగోలేదని, అతడు వన్డేలకు పనికిరాడని అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయని గంగూలీ గుర్తు చేసుకున్నారు.
గంగూలీ కెప్టెన్సీ కాలంలో సెలక్టర్లు తరచూ ఆయన దగ్గరకు వచ్చి ద్రవిడ్‌ను వన్డేల నుంచి తప్పించాలని కోరేవారట. “రాహుల్ ద్రవిడ్ స్ట్రైక్ రేట్ సరిగా లేదు.. వన్డేల్లో హిట్టింగ్ చేసే ప్లేయర్ కావాలి” అని వారు మొండిగా వాదించేవారట. కానీ గంగూలీకి ద్రవిడ్ విలువేంటో తెలుసు. “నేను అతడిని వదిలేస్తే అతడి కెరీర్ ముగిసిపోతుంది. అందుకే నేను సెలక్టర్ల మాట వినలేదు. ద్రవిడ్ దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా.. జమ్, నువ్వు కొంచెం వేగంగా ఆడాలి అని చెప్పేవాడిని. ద్రవిడ్ గొప్ప ఆటగాడు కాబట్టి ఆ పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకున్నాడు” అని గంగూలీ వెల్లడించారు.
అప్పట్లో భారత్ దగ్గర ఆడమ్ గిల్‌క్రిస్ట్, సంగక్కర, మార్క్ బౌచర్ లాగా బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్ లేరు. దీనివల్ల టీమిండియా బ్యాటింగ్ కేవలం 6వ స్థానంలోనే ముగిసిపోయేది. ఈ సమస్యను అధిగమించడానికి గంగూలీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ద్రవిడ్‌ను వికెట్ కీపింగ్ చేయమని ఒప్పించారు. “ద్రవిడ్ కీపింగ్ చేయడం వల్ల మాకు ఒక ఎక్స్‌ట్రా బ్యాటర్ (మొహమ్మద్ కైఫ్)ను ఆడించే అవకాశం దక్కింది. దీనివల్ల మా బ్యాటింగ్ లైనప్ 7వ స్థానం వరకు పెరిగింది. జట్టు బ్యాలెన్సింగ్ కోసం ద్రవిడ్ ఆ బాధ్యతను సంతోషంగా స్వీకరించాడు” అని గంగూలీ చెప్పుకొచ్చారు.
ఆ రోజుల్లో జట్టులో సరైన ఆల్ రౌండర్లు లేకపోవడం వల్ల తానే స్వయంగా బౌలింగ్ చేయాల్సి వచ్చేదని గంగూలీ తెలిపారు. “మా దగ్గర అప్పట్లో జెన్యూన్ ఆల్ రౌండర్లు లేరు. అందుకే జట్టు కోసం సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, నేను బౌలింగ్ చేసేవాళ్ళం. ఒక పటిష్టమైన టీమ్‌ను నిర్మించాలంటే ఇలాంటి సర్దుబాట్లు తప్పవు. ఆ కష్ట కాలంలో మేమంతా కలిసికట్టుగా టీమ్‌ను నిర్మించాం” అని గంగూలీ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ద్రవిడ్ లాంటి వెర్సటైల్ ప్లేయర్ దొరకడం తన కెప్టెన్సీకి దక్కిన అదృష్టమని ఆయన కొనియాడారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..