Surya kumar Yadav : రోహిత్-కోహ్లీ రికార్డుకు ఎసరు..సాగర తీరంలో సూర్య మిషన్ 41 సక్సెస్ అవుతుందా?

Surya kumar Yadav : వైజాగ్ సాగర తీరం అంటే టీమిండియా కెప్టెన్, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్‌కు మహా ఇష్టం. ఇక్కడి పిచ్‌పై సూర్య బ్యాట్ ఝుళిపిస్తే బంతి స్టేడియం దాటాల్సిందే. నేడు న్యూజిలాండ్‌తో జరగనున్న నాలుగో టీ20లో సూర్యకుమార్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటిదాకా టీమిండియా తరఫున కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే సాధించిన ఒక అరుదైన రికార్డుపై సూర్య కన్నేశాడు. కేవలం 41 పరుగులు చేస్తే చాలు.. సూర్య ఖాతాలో ఒక మెగా మైలురాయి వచ్చి చేరుతుంది.

Surya kumar Yadav : రోహిత్-కోహ్లీ రికార్డుకు ఎసరు..సాగర తీరంలో సూర్య మిషన్ 41 సక్సెస్ అవుతుందా?
Suryakumar Yadav

Updated on: Jan 28, 2026 | 11:23 AM

Surya kumar Yadav : టీ20 క్రికెట్ ప్రపంచంలో సూర్యకుమార్ యాదవ్ ఒక సంచలనం. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కెప్టెన్ సూర్య ఫామ్ చూస్తుంటే అభిమానులు పండగ చేసుకుంటున్నారు. బుధవారం విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగే నాలుగో టీ20 మ్యాచ్ సూర్య కెరీర్‌లో అత్యంత కీలకం కానుంది. కేవలం 41 పరుగులు చేస్తే, అంతర్జాతీయ టీ20ల్లో 3,000 పరుగుల మైలురాయిని అందుకున్న మూడో భారతీయ క్రికెటర్‌గా సూర్య చరిత్ర సృష్టించనున్నాడు. ఇంతకుముందు కేవలం రోహిత్ శర్మ (4231 పరుగులు), విరాట్ కోహ్లీ (4188 పరుగులు) మాత్రమే ఈ ఘనత సాధించారు.

సూర్య ‘మిషన్ 41’.. ఎలాగంటే?

సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 102 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 96 ఇన్నింగ్స్‌లలో కలిపి మొత్తం 2959 పరుగులు చేశాడు. నేటి మ్యాచ్‌లో మరో 41 పరుగులు సాధిస్తే, ఆ అరుదైన 3000 క్లబ్‎లో చేరిపోతాడు. విశేషం ఏంటంటే సూర్య ఈ మైలురాయిని రోహిత్, విరాట్ కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అందుకునే అవకాశం ఉంది. ప్రస్తుత సిరీస్‌లో సూర్య జోరు మామూలుగా లేదు. రెండో టీ20లో 82 పరుగులు (నాటౌట్), మూడో టీ20లో 57 పరుగులు (నాటౌట్) చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. అదే ఊపులో నేడు వైజాగ్‌లోనూ చెలరేగితే రికార్డు నమోదు కావడం ఖాయం.

వైజాగ్‌లో సూర్య రికార్డు మామూలుగా లేదు

విశాఖ స్టేడియం సూర్యకుమార్‌కు చాలా బాగా అచ్చొచ్చిన మైదానం. గతంలో 2023 నవంబర్ 23న ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20లో సూర్య వీరవిహారం చేశాడు. ఆస్ట్రేలియా విధించిన 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, కేవలం 42 బంతుల్లోనే 80 పరుగులు బాదాడు. అందులో 9 ఫోర్లు, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. 190 పైచిలుకు స్ట్రైక్ రేట్‌తో ఆస్ట్రేలియా బౌలర్లను ఉతికి ఆరేసిన సూర్య, మరోసారి అలాంటి ప్రదర్శనే చేయడానికి సిద్ధమవుతున్నాడు. విశాఖ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటం సూర్యకు మరింత ప్లస్ పాయింట్.

క్లీన్ స్వీప్‌పై కన్నేసిన టీమిండియా

వ్యక్తిగత రికార్డులతో పాటు కెప్టెన్ సూర్యకుమార్ తన జట్టును క్లీన్ స్వీప్ వైపు నడిపించాలని చూస్తున్నాడు. ఇప్పటికే 3-0తో సిరీస్ దక్కించుకున్న భారత్, నాలుగో మ్యాచ్‌లో కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని భావిస్తోంది. సూర్య ఫామ్‌లో ఉండటం, అటు బౌలర్లు కూడా రాణిస్తుండటంతో కివీస్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు కష్టమే అనిపిస్తోంది. సాగర తీరంలో సిక్సర్ల వర్షం కురిపించి, రోహిత్-విరాట్ సరసన తన పేరును లిఖించుకోవాలని సూర్య పట్టుదలగా ఉన్నాడు.