Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు అరుదైన అవకాశం? టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా బాధ్యతలు

ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్లు వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్లను నియమిస్తుంటాయి. ఈ పద్ధతిలో మంచి ఫలితాలు కూడా సాధిస్తుంటాయి. అయితే టీమిండియాలో మాత్రం చాలా కాలం ఒకే కెప్టెన్ విధానం నడిచింది. మొదట ధోనీ, ఆ తర్వాత కోహ్లీ, అనంతరం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కొనసాగారు.

Shubman Gill : శుభ్‌మన్ గిల్‌కు అరుదైన అవకాశం? టీమిండియా మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా బాధ్యతలు
Jersey Auction

Updated on: Aug 14, 2025 | 11:06 AM

Shubman Gill : భారత క్రికెట్‌లో ఒకే కెప్టెన్ విధానానికి మళ్లీ తెర లేవబోతోంది. వేర్వేరు ఫార్మాట్‌లకు వేర్వేరు కెప్టెన్‌లు ఉన్నప్పటికీ, టీమిండియా సెలక్టర్లు ఇప్పుడు అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‎ను నియమించాలని యోచిస్తున్నారు. ఈ క్రమంలో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వైపు వారి చూపు పడిందని తెలుస్తోంది. టెస్ట్ కెప్టెన్‌గా ఇటీవల అద్భుతంగా రాణించిన గిల్, త్వరలో టీమిండియా అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకప్పుడు ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ వంటి కెప్టెన్లు అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు కెప్టెన్‎గా వహించారు. అయితే, రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలకడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు శుభ్‌మన్ గిల్, వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్‌లుగా ఉన్నారు. ఈ ముగ్గురు కెప్టెన్ల విధానాన్ని సెలక్టర్లు అంతగా ఇష్టపడటం లేదు. ఒకే కెప్టెన్ ఉంటే జట్టులో మరింత ఐక్యత, భవిష్యత్ ప్రణాళికలు మెరుగ్గా ఉంటాయని వారు భావిస్తున్నట్లు సమాచారం.

చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ టీమిండియా భవిష్యత్తు కోసం గిల్‌ను మెయిన్ కెప్టెన్‌గా చూడాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. గిల్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో గిల్ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. 2-2తో సిరీస్‌ను డ్రాగా ముగించి, తన నాయకత్వ పటిమను చాటాడు.

ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వయస్సు 38 కావడంతో ఆయన త్వరలో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఆ తర్వాత వన్డే కెప్టెన్సీ గిల్‌కే దక్కవచ్చు. అలాగే, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వయస్సు 34 ఏళ్లు. టీమిండియా భవిష్యత్తు కోసం యంగ్ కెప్టెన్‌ను కొనసాగించాలని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో 25 ఏళ్ల గిల్‌కు అన్ని ఫార్మాట్ల బాధ్యతలు అప్పగించాలని యోచిస్తున్నారు. గిల్ ఐపీఎల్‌లో, టెస్టుల్లో తన కెప్టెన్సీని నిరూపించుకున్నాడు. త్వరలో టీ20 జట్టులోకి కూడా తీసుకుని కెప్టెన్‌గా నియమించాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారని సమాచారం.

వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్లో గిల్‌కు కచ్చితంగా చోటు దక్కనుంది. ప్రస్తుతం అతనికి కెప్టెన్సీ ఇవ్వకపోయినా, రాబోయే రోజుల్లో టీ20 ఫార్మాట్‌లో కూడా జట్టు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో టీమిండియా ఒకే కెప్టెన్, అంటే శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..