
IND vs SA Test : కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సౌతాఫ్రికా చేతిలో తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు, ఇప్పుడు రెండో టెస్ట్ కోసం తీసుకుంటున్న నిర్ణయం నిజంగా ఆశ్చర్యకరం. ఈ నిర్ణయం వల్ల గువాహటిలో జరగబోయే చివరి టెస్ట్‌లో కూడా టీమిండియా ఓడిపోయే ప్రమాదం ఉందని క్రికెట్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ టీమిండియా తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? గువాహటి టెస్ట్‌పై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం భారత జట్టు సాధారణంగా మ్యాచ్ ముగిసిన వెంటనే తదుపరి వేదికకు వెళ్తుంది. కానీ ఈసారి కోల్‌కతాలో ఓడిపోయిన తర్వాత కూడా టీమిండియా అక్కడే ఉండిపోయింది. మంగళవారం రోజు ఈడెన్ గార్డెన్స్‌లోనే ప్రాక్టీస్ చేయాలని జట్టు నిర్ణయించుకుంది. జట్టు కోల్‌కతాలో ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించడం చూస్తుంటే, గువాహటిలో కూడా కోల్‌కతా పిచ్‌లాంటిదే తయారు చేయాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. కోల్‌కతాలో స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. అయినా సరే, గువాహటిలో కూడా స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌నే తయారు చేయాలని టీమిండియా మొగ్గు చూపుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
గువాహటిలో భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో, చివరి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా స్పిన్‌కు అనుకూలించే వికెట్‌ను తయారు చేస్తే, భారత బ్యాట్స్‌మెన్‌కు మళ్లీ కష్టాలు తప్పకపోవచ్చు. గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో భారత్ 0-3 తేడాతో ఓడిపోయింది. వెస్టిండీస్‌పై గెలిచినా, వారికి నాణ్యమైన స్పిన్నర్లు లేరు. కానీ ఇప్పుడు సౌతాఫ్రికా జట్టులోని స్పిన్నర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా పిచ్ స్వభావాన్ని మార్చకుండా స్పిన్ పిచ్‌పైనే ఆధారపడాలని అనుకోవడం క్లీన్ స్వీప్ ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
టీమిండియాకు మరో ముఖ్యమైన ఆందోళన ఏమిటంటే రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండో టెస్ట్‌కు అందుబాటులో ఉండకపోవడం. తొలి టెస్ట్ సమయంలో ఆయన మెడకు గాయం కావడంతో ఐసీయూలో కూడా చికిత్స తీసుకున్నారు. దీంతో గువాహటి టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమే అని తెలుస్తోంది. ఒకవేళ గిల్ ఆడకపోతే అతని స్థానంలో యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్ లేదా దేవదత్ పడిక్కల్‌లో ఒకరికి తుది జట్టులో అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కెప్టెన్ లేకపోవడం, పైగా పిచ్ విషయంలో రిస్క్ తీసుకోవడం.. ఇవన్నీ కలిపి గువాహటి టెస్ట్ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..