
Sarfaraz Khan Fastest Fifty: భారత దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఖాన్ మరోసారి తన బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం బాది, లిస్ట్-ఏ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న భారతీయ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. టీమ్ ఇండియా ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతూ ఒకే ఓవర్‌లో 30 పరుగులు రాబట్టడం విశేషం.
అభిషేక్ శర్మ ఓవర్‌లో పరుగుల వర్షం.. ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ క్రీజులోకి వచ్చిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన సోదరుడు ముషీర్ ఖాన్ అవుట్ అయిన తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్, ఏమాత్రం సమయం వృథా చేయలేదు. టీమ్ ఇండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ బౌలింగ్‌కు రాగా, ఆ ఓవర్‌ను సర్ఫరాజ్ లక్ష్యంగా చేసుకున్నాడు. వరుసగా 6, 4, 6, 4, 6, 4 బాదుతూ ఒకే ఓవర్‌లో ఏకంగా 30 పరుగులు పిండుకున్నాడు. అతని హిట్టింగ్‌కు స్టేడియం దద్దరిల్లిపోయింది.
15 బంతుల్లోనే రికార్డు హాఫ్ సెంచరీ.. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం రికార్డును సర్ఫరాజ్ తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు.
దీనికి ముందు 2020-21 సీజన్‌లో బరోడా ఆటగాడు అతీత్ షేత్ (16 బంతుల్లో) పేరిట ఉన్న రికార్డును సర్ఫరాజ్ అధిగమించాడు. అలాగే 1995లో అభిజీత్ కాలే నెలకొల్పిన 16 బంతుల రికార్డు కూడా ఇప్పుడు కనుమరుగైపోయింది.
20 బంతుల్లో 62 పరుగులు.. సర్ఫరాజ్ తన మెరుపు ఇన్నింగ్స్‌లో మొత్తం 20 బంతులు ఎదుర్కొని 62 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. అంటే కేవలం బౌండరీల రూపంలోనే 58 పరుగులు రాబట్టాడు. అతని స్ట్రైక్ రేట్ చూస్తుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించాయని అర్థమవుతోంది.
భీకరమైన ఫామ్‌లో సర్ఫరాజ్.. ప్రస్తుత విజయ్ హజారే ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో 75.75 సగటుతో, 190.56 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 303 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధశతకాలు ఉన్నాయి. ఇటీవల గోవాపై జరిగిన మ్యాచ్‌లో కేవలం 56 బంతుల్లోనే సెంచరీ బాదిన సర్ఫరాజ్, మొత్తంగా 75 బంతుల్లో 157 పరుగులు చేసి ముంబై భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 203 స్ట్రైక్ రేట్‌తో 329 పరుగులు చేసి తన సత్తా చాటాడు.
సర్ఫరాజ్ చూపిస్తున్న ఈ ఫామ్ చూస్తుంటే, రాబోయే అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో అతను టీమ్ ఇండియాకు వెన్నెముకగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..