Sanju Samson : సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే ప్రపంచ రికార్డు

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో కేరళ కుర్రాడు సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ తన టాలెంటును గుర్తించలేదని బాధపడ్డ అభిమానులందరికీ తన బ్యాట్‌తోనే అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సంజు శాంసన్ శివమెత్తాడు.

Sanju Samson : సంజు శాంసన్ విశ్వరూపం..వరల్డ్ కప్ చరిత్రలోనే అదిరిపోయే ప్రపంచ రికార్డు
Sanju Samson

Updated on: Mar 03, 2026 | 7:59 AM

Sanju Samson : టీ20 వరల్డ్ కప్ 2026లో కేరళ కుర్రాడు సంజు శాంసన్ చరిత్ర సృష్టించాడు. ఇన్నాళ్లూ తన టాలెంటును గుర్తించలేదని బాధపడ్డ అభిమానులందరికీ తన బ్యాట్‌తోనే అదిరిపోయే సమాధానం ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన చావోరేవో తేల్చుకోవాల్సిన పోరులో సంజు శాంసన్ శివమెత్తాడు. 196 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అజేయంగా 97 పరుగులు చేసి, భారత్‌ను 5 వికెట్ల తేడాతో గెలిపించడమే కాకుండా.. ఏకంగా వరల్డ్ రికార్డులనే తిరగరాశాడు. టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చిన సంజు, ఇప్పుడు గూగుల్ ట్రెండింగ్‌లో టాప్‌లో ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో సంజు శాంసన్ నెలకొల్పిన ఒక రికార్డు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సమయం క్రీజులో గడిపిన బ్యాటర్‌గా సంజు ప్రపంచ రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ సంజు ఏకంగా 108 నిమిషాల పాటు క్రీజులో నిలబడ్డాడు. గతంలో ఈ రికార్డు స్కాట్లాండ్ ప్లేయర్ జార్జ్ మున్సే (106 నిమిషాలు) పేరు మీద ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపేసిన సంజు.. డెవాన్ కాన్వే, మొహమ్మద్ రిజ్వాన్ వంటి దిగ్గజాలను కూడా వెనక్కి నెట్టేశాడు. కేవలం నిమిషాల్లోనే కాదు, పరుగుల వరదలోనూ సంజు తగ్గేదేలే అన్నాడు.

సంజు ఇక్కడితో ఆగలేదు.. సాక్షాత్తూ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును కూడా బద్దలు కొట్టాడు. టీ20 వరల్డ్ కప్‌లో లక్ష్య ఛేదన సమయంలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయర్‌గా సంజు నిలిచాడు. 2016లో ఆస్ట్రేలియాపై కోహ్లీ చేసిన 82 పరుగుల రికార్డు ఇన్నాళ్లూ చెక్కుచెదరకుండా ఉంది. కానీ సంజు తన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా, వరల్డ్ కప్ చరిత్రలో భారత్ ఛేదించిన అత్యధిక స్కోరుకు కూడా సంజునే సూత్రధారి కావడం విశేషం.

ఒక వికెట్ కీపర్ బ్యాటర్‌గా కూడా సంజు టీమిండియాకు కొత్త చరిత్రను అందించాడు. టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున ఒక వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోరు రికార్డు ఇన్నాళ్లూ ఇషాన్ కిషన్ పేరిట ఉండేది. ఇప్పుడు దానిని కూడా సంజు అధిగమించాడు. ఇన్నాళ్లూ ప్లేయింగ్ ఎలెవన్‎లో చోటు కోసం ఎదురుచూసిన ఈ టాలెంటెడ్ ప్లేయర్, ఒక్క ఇన్నింగ్స్‌తో సెలక్టర్ల మైండ్ బ్లాక్ చేసేశాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా సంజు శాంసన్ నామస్మరణ మారుమోగిపోతోంది.

సంజు శాంసన్ చూపించిన ఈ విశ్వరూపంతో భారత్ ఇప్పుడు సెమీఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైంది. సంజు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత్‌కు రెండో టీ20 వరల్డ్ కప్ దక్కడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన మీద వచ్చిన విమర్శలన్నింటినీ సిక్సర్ల రూపంలో బౌండరీ అవతలకు పంపేసిన సంజు, నిజంగానే క్లాస్ అండ్ మాస్ కాంబినేషన్ అని నిరూపించుకున్నాడు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us