
Sachin Tendulkar : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ తన క్రీడా నైపుణ్యంతో పాటు సరదా స్వభావంతోనూ అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఒక టీవీ షోలో సచిన్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. తాను భారత జట్టులో కొత్తగా చేరినప్పుడు, విమానంలో సచిన్ తనను తన కొడుకుగా ఎలా పరిచయం చేసి అందరినీ నవ్వించారో రైనా వివరించారు. ఈ సరదా సంఘటన 2011 వన్డే ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యుల మధ్య ఉన్న గొప్ప అనుబంధాన్ని తెలియజేస్తుంది.
చీకీ సింగిల్స్ అనే షోలో సురేష్ రైనా ఆసక్తికరమైన కథనాన్ని పంచుకున్నారు. తాను దాదాపు 18 ఏళ్ల వయసులో మొదటిసారిగా భారత జట్టుతో కలిసి ఒక టెస్ట్ మ్యాచ్ ఆడటానికి వెళ్తుండగా, విమానంలో బిజినెస్ క్లాస్‌లో సచిన్ పక్కన కూర్చున్నారు. ఈ సమయంలో ఒక ఎయిర్ హోస్టెస్ వచ్చి, సచిన్ను పలకరించి, పక్కన ఉన్న రైనాను చూసి పొరపాటున అతని కొడుకు అర్జున్ అనుకుంది.
ఎయిర్ హోస్టెస్ రైనాతో “హాయ్ అర్జున్! మీరు ఎలా ఉన్నారు? మీ అమ్మగారు ఎలా ఉన్నారు?” అని అడిగింది. ఆమె అలా అడగగానే సచిన్ వెంటనే సరదాగా, “అవును, ఇతను అస్సలు చదువుకోవడం లేదు, నేను ఏం చేయాలి? అంజలి (భార్య)కి కూడా ఈ విషయం చెప్పాను” అని బదులిచ్చారు. సచిన్ చేసిన ఈ సరదా వ్యాఖ్యతో ఎయిర్ హోస్టెస్ ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత సచిన్, రైనా ఇద్దరూ నవ్వుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత, సచిన్ ఆ ఎయిర్ హోస్టెస్‌తో అసలు విషయం వివరించారు. రైనా తన కొడుకు కాదని, భారత జట్టులో కొత్తగా చేరిన ఆటగాడని చెప్పారు. తన పొరపాటుకు ఆమె రైనాకు క్షమాపణలు కూడా చెప్పారని, ఆ తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందని రైనా తెలిపారు. సచిన్ ఇలా కొత్త ఆటగాళ్లతో సరదాగా మాట్లాడి, వారిలో ఉన్న ఒత్తిడిని తగ్గించేవారని, జట్టులో మంచి వాతావరణం ఉండేలా చూసుకునేవారని రైనా చెప్పారు. ఈ సంఘటన సచిన్ వ్యక్తిత్వంలో ఉన్న మంచి హాస్య చతురతను, సహచరులతో ఆయనకున్న గొప్ప సంబంధాలను తెలియజేస్తుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..