
Sachin Tendulkar : క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ 33 ఏళ్ల క్రితం ఒక సంప్రదాయాన్ని మొదలుపెట్టాడు. అది ఈనాటికీ టీమిండియాలో కొనసాగుతోంది. భారత క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ చేయలేని రికార్డులను సృష్టించిన సచిన్, తన దేశం పట్ల చూపించిన ప్రేమ, గౌరవం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. ఒకసారి ఆయన.. “నేను ఏ బోర్డు కోసం కాదు, దేశం కోసం ఆడుతున్నాను” అని చెప్పాడు. ఆ తరువాత తన హెల్మెట్‌పై మువ్వన్నెల జెండా స్టిక్కర్‌ను అంటించుకోవడం మొదలుపెట్టాడు. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది.
1992లో సచిన్ టెండూల్కర్, తన హెల్మెట్‌పై భారత జాతీయ జెండాను అంటించుకోవడం మొదలుపెట్టారు. దీని గురించి అడిగినప్పుడు.. “నేను ఏ బోర్డు కోసం కాదు, నా దేశం కోసం ఆడుతున్నాను. అందుకే నా హెల్మెట్‌పై తిరంగాను అంటించుకుంటాను” అని బదులిచ్చారు. సచిన్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయం, ఆ తర్వాత వచ్చిన క్రికెటర్లకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఇప్పుడు చాలా మంది భారత క్రికెటర్లు తమ హెల్మెట్‌పై త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవడం మనం చూస్తుంటాం.
సచిన్ కేవలం తన మాటలతోనే కాదు, తన ప్రవర్తనతో కూడా దేశం పట్ల తన ప్రేమను చూపించారు. 1996 ప్రపంచ కప్‌లో సచిన్ తన బ్యాట్‌పై ఏ కంపెనీ స్టిక్కర్‌ను పెట్టుకోకుండా ఆడారు. అందుకు కారణం, టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో స్టిక్కర్ లేని బ్యాట్‌తో ఆడి చాలా పరుగులు చేశారు. ఆ తర్వాత ఆ బ్యాట్ తనకు బాగా కలిసి వచ్చిందని భావించి, ప్రపంచ కప్ మొత్తం అదే బ్యాట్‌తో ఆడాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో స్పాన్సర్ల నుండి ఎంత డబ్బు ఆఫర్ చేసినా, ఆయన నిరాకరించారు. ఆ ప్రపంచ కప్‌లో సచిన్ అత్యధిక పరుగులు సాధించారు.
సచిన్ వ్యక్తిత్వంలో మరొక గొప్ప విషయం ఏమిటంటే.. అతను 2010లో విజయ్ మాల్యా కంపెనీకి చెందిన మద్యం ప్రకటనను తిరస్కరించారు. ఆ ప్రకటన కోసం మాల్యా కంపెనీ రూ. 20 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ సచిన్ దానిని నిరాకరించారు. “నేను ఎప్పుడూ మద్యం, పొగాకు ప్రకటనలలో నటించను, ఎందుకంటే నేను తప్పుడు ఉదాహరణను ఇవ్వకూడదని మా నాన్న నాకు నేర్పించారు” అని సచిన్ చెప్పారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు, సచిన్ తన బ్యాట్‌కు త్రివర్ణ పతాకం రంగులలో ఉన్న గ్రిప్‌ను వాడారు. తన జీవితంలో ఆడిన ప్రతి క్షణం తన దేశం కోసమే ఆడానని అభిమానులకు చెప్పడమే దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం. సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు, అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడు. అతను మొత్తం 100 సెంచరీలు సాధించి ‘సెంచరీల సెంచరీ’ అనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..