
Rohit Sharma: ముంబై ఇండియన్స్ మళ్లీ తన విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు అతడిని కెప్టెన్‌గా నియమిస్తూ నవంబర్ 27న అధికారిక ప్రకటన చేసింది. 2023 సీజన్ తర్వాత కెప్టెన్సీ కోల్పోయిన రోహిత్.. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నాడు. హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లడంతో ముంబై నాయకత్వంలో మార్పు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ వైపే మేనేజ్‌మెంట్ మొగ్గు చూపింది. అతడి పాత రికార్డులు చూస్తే ముంబై ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందో అర్థమవుతుంది.
158 మ్యాచ్‌లు.. 87 విజయాలు.. 5 టైటిళ్లు
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ 158 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. ఇందులో 87 విజయాలు అందించాడు. 67 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురైంది. మరో నాలుగు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. అతడి విజయాల శాతం 56.32గా నమోదైంది. కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ టైటిళ్లు సాధించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు టైటిళ్లు గెలిచిన కెప్టెన్లలో ఎంఎస్ ధోనీతో కలిసి రోహిత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఘనత సాధించిన తొలి కెప్టెన్ రోహితే కావడం విశేషం.
రికీ పాంటింగ్ నుంచి పగ్గాలు
రోహిత్ శర్మ 2011లో దక్కన్ ఛార్జర్స్ నుంచి ముంబై ఇండియన్స్‌లోకి వచ్చాడు. అప్పట్లో అతడి కోసం ఫ్రాంచైజీ భారీ మొత్తం వెచ్చించింది. 2013 సీజన్‌లో ముంబై ఆరంభం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో అప్పటి కెప్టెన్ రికీ పాంటింగ్ తప్పుకున్నాడు. దీంతో జట్టు పగ్గాలు రోహిత్ చేతికి వచ్చాయి. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ముంబైకి తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. అక్కడి నుంచి మొదలైన విజయాల పరంపర 2020 వరకు కొనసాగింది. 2015లో రెండోసారి, 2017లో మూడోసారి, 2019లో నాలుగోసారి, 2020లో ఐదోసారి ముంబైని విజేతగా నిలిపాడు.
ఐపీఎల్ ఫైనల్స్‌లోనూ రోహిత్‌ది ప్రత్యేక రికార్డు
రోహిత్ శర్మ ఐపీఎల్ కెరీర్‌లో దక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున మొత్తం ఆరు ఫైనల్స్‌లో ఆడాడు. ఆరింటిలోనూ అతడి జట్టే విజయం సాధించడం విశేషం. 2009లో దక్కన్ ఛార్జర్స్ తరఫున టైటిల్ గెలిచిన రోహిత్.. ముంబై తరఫున మరో ఐదు ట్రోఫీలు అందుకున్నాడు. ఈ ఆరు ఫైనల్స్‌లో 183 పరుగులు చేశాడు. 30.50 సగటుతో బ్యాటింగ్ చేశాడు. రెండు అర్ధశతకాలు సాధించగా.. అత్యధిక స్కోరు 68 పరుగులు. అంటే ఫైనల్స్‌లో ఆడిన ప్రతిసారీ విజేత జట్టులో భాగమయ్యాడు.
ఆరేళ్ల నిరీక్షణకు తెరదించగలడా?
2020లో చివరిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై.. ఆ తర్వాత ఆరు సీజన్లుగా ట్రోఫీకి దూరంగా ఉంది. గత మూడు సీజన్లలోనూ జట్టు ప్రదర్శన స్థిరంగా లేదు. 2024లో పదో స్థానంలో నిలిచిన ముంబై.. 2025లో నాలుగో స్థానానికి చేరింది. 2026లో మళ్లీ తొమ్మిదో స్థానానికి పడిపోయింది. దీంతో జట్టుకు పాత విజయాల బాట చూపించగల నాయకుడి కోసం మేనేజ్‌మెంట్ రోహిత్ వైపు చూసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ పేర్లు కూడా నాయకత్వం కోసం పరిశీలనలో ఉన్నప్పటికీ.. చివరకు అనుభవానికే ప్రాధాన్యం ఇచ్చింది. మరి తిరిగి కెప్టెన్‌గా వచ్చిన రోహిత్ ముంబైకి ఆరో ఐపీఎల్ టైటిల్ అందిస్తాడా? అనేది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న ప్రశ్న.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..