Rohit Sharma : హిట్‎మాన్‎లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్..2027 వరల్డ్ కప్ కలేనా?

Rohit Sharma : ఇండోర్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ కేవలం 11 పరుగులకే వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేసింది. గతేడాది ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా నిలిచిన రోహిత్, ఇప్పుడు కివీస్‌పై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం చర్చనీయాంశమైంది.

Rohit Sharma : హిట్‎మాన్‎లో కసి చచ్చిపోయిందా?..కివీస్ మాజీ స్టార్ షాకింగ్ కామెంట్స్..2027 వరల్డ్ కప్ కలేనా?
Rohit Sharma

Updated on: Jan 19, 2026 | 7:47 PM

Rohit Sharma : న్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ ఘోరంగా ఫెయిలయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను కేవలం 61 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 26 పరుగులు. ముఖ్యంగా ఇండోర్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ కేవలం 11 పరుగులకే వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేసింది. గతేడాది ఆస్ట్రేలియాపై ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‎గా నిలిచిన రోహిత్, ఇప్పుడు కివీస్‌పై కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోవడం చర్చనీయాంశమైంది.

సైమన్ డౌల్ ఏమన్నారంటే?

రోహిత్ ఆటతీరును గమనించిన న్యూజిలాండ్ మాజీ పేసర్, కామెంటేటర్ సైమన్ డౌల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “రోహిత్‌కు ఎప్పుడూ ఒక టార్గెట్ ఉంటుంది.. టీ20 వరల్డ్ కప్ లేదా 50 ఓవర్ల వరల్డ్ కప్ వంటి గోల్ ఉంటేనే అతను కసితో ఆడతాడు. కానీ 2027 వన్డే వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. అంతవరకు ఆడే కసి రోహిత్‌లో ఉందా? అని నాకు అనుమానంగా ఉంది” అని డౌల్ విశ్లేషించారు. రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌కే పరిమితం అవ్వడం వల్ల, అతనికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ లభించడం లేదని, ఇది అతని ఫామ్‌పై ప్రభావం చూపుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

రోహిత్ ఫామ్‌పై విమర్శలు వస్తున్న తరుణంలో, టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతనికి సపోర్టుగా నిలిచాడు. “రోహిత్ భాయ్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సిరీస్‌ల్లో అతను బాగా ఆడాడు. ప్రతి మ్యాచ్‌లోనూ భారీ స్కోర్లు చేయడం ఎవరికైనా సాధ్యం కాదు. అతను త్వరలోనే పుంజుకుంటాడు” అని గిల్ ధీమా వ్యక్తం చేశాడు. అయితే మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రం డౌల్ వ్యాఖ్యలతో కొంతవరకు ఏకీభవించారు. క్రికెట్‌లో సుదీర్ఘకాలం రాణించాలంటే ఆటపై కసి, కోరిక చాలా ముఖ్యమని శాస్త్రి పేర్కొన్నారు.

టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న రోహిత్.. మళ్ళీ భారత జెర్సీలో కనిపించాలంటే జూలైలో జరిగే ఇంగ్లాండ్ పర్యటన వరకు ఆగాల్సిందే. అంటే దాదాపు ఐదు నెలల పాటు అతనికి అంతర్జాతీయ మ్యాచ్‌లు లేవు. ఈ లోపు మార్చిలో ప్రారంభమయ్యే ఐపీఎల్ 2026లో రోహిత్ ముంబై ఇండియన్స్ తరపున ఆడనున్నాడు. తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని హిట్ మాన్ పట్టుదలతో ఉన్నాడు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..