Team India: రజత్ పటీదార్ ఔట్.. రింకూ సింగ్‌కు ప్రమోషన్.. టీమిండియాలో కీలక మార్పులు

Team India: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు ముందు ఇండియా A జట్టులో కీలక మార్పులు జరిగాయి. గాయం కారణంగా రజత్ పటీదార్ టోర్నీ నుంచి తప్పుకోగా, అతడి స్థానంలో ఆయుష్ బదోనీకి అవకాశం దక్కింది. వైస్ కెప్టెన్‌గా రింకూ సింగ్‌ను నియమించారు. తిలక్ వర్మ కెప్టెన్సీలో భారత్ నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 22న పాకిస్థాన్ Aతో తలపడనుంది.

Team India: రజత్ పటీదార్ ఔట్.. రింకూ సింగ్‌కు ప్రమోషన్.. టీమిండియాలో కీలక మార్పులు
Rajat Patidar

Updated on: Nov 08, 2026 | 2:41 PM

Team India: ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు ముందు భారత జట్టులో కీలక మార్పులు జరిగాయి. గాయం కారణంగా ఈ టోర్నీకి దూరంగా ఉండాలని రజత్ పటీదార్ నిర్ణయించుకోవడంతో అతడి స్థానంలో ఆయుష్ బదోనీకి అవకాశం దక్కింది. మరోవైపు పటీదార్ నిర్వహించాల్సిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను స్టార్ బ్యాటర్ రింకూ సింగ్‌కు అప్పగించారు. ఇప్పటికే తిలక్ వర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఇండియా A జట్టులో ఈ మార్పులు ఆసక్తి పెంచుతున్నాయి. నవంబర్ 19 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ తన తొలి మ్యాచ్‌ను నవంబర్ 20న నేపాల్‌తో ఆడనుంది.

గాయాల కారణంగా రజత్ పటీదార్ దూరం

బీసీసీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం తనకు ఉన్న గాయాలను దృష్టిలో పెట్టుకుని 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఎంపిక కోసం తన పేరును పరిగణనలోకి తీసుకోవద్దని రజత్ పటీదార్ బోర్డుకు తెలిపాడు. దీంతో అతడిని ఇండియా A జట్టు నుంచి తప్పించారు. అయితే పటీదార్‌కు ప్రస్తుతం ఏ గాయం ఉంది? ఎప్పటికి కోలుకుంటాడు? అనే వివరాలను బీసీసీఐ వెల్లడించలేదు. గతంలోనూ అతడు గాయాల సమస్యతో ఇబ్బంది పడ్డాడు. 2025 అక్టోబర్‌లో ఎడమ మోకాలి సమస్యతో దేశవాళీ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 సమయంలో వేలికి గాయమైంది.

రింకూ సింగ్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు

రజత్ పటీదార్ వైదొలగడంతో అతడి స్థానంలో రింకూ సింగ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న రింకూకు ఇప్పుడు నాయకత్వ బాధ్యతలు కూడా దక్కాయి. మరోవైపు పటీదార్ స్థానంలో ఆయుష్ బదోనీని జట్టులోకి తీసుకున్నారు. దీంతో తిలక్ వర్మ కెప్టెన్‌గా, రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఇండియా A జట్టు ఈ టోర్నీలో బరిలోకి దిగనుంది.

వైభవ్ సూర్యవంశీ నుంచి అభిషేక్ శర్మ వరకు..

ఈసారి ఇండియా A జట్టులో యంగ్ టాలెంట్లతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాళ్లకు కూడా చోటు కల్పించారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. వీరితో పాటు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్, హర్ష్ దూబే వంటి ఆటగాళ్లకు అవకాశం దక్కింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంతో కనిపిస్తున్న ఈ జట్టు టైటిల్‌పై కన్నేసింది.

నవంబర్ 20న తొలి మ్యాచ్

ఇండియా A జట్టును గ్రూప్ Bలో ఉంచారు. ఈ గ్రూపులో పాకిస్థాన్ A, నేపాల్, యూఏఈ జట్లు ఉన్నాయి. నవంబర్ 20న నేపాల్‌తో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత నవంబర్ 22న పాకిస్థాన్ Aతో తలపడుతుంది. నవంబర్ 24న యూఏఈతో గ్రూప్ దశలో చివరి మ్యాచ్ ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 29న ఫైనల్ జరగనుంది. భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే పోరుపై అభిమానుల్లో ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

ఇండియా A పూర్తి జట్టు ఇదే

బీసీసీఐ ప్రకటించిన తాజా జట్టులో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ప్రభ్‌సిమ్రన్ సింగ్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుశాగ్ర, సూర్యాంశ్ షెడ్గే, షాబాజ్ అహ్మద్, విప్రజ్ నిగమ్, హర్ష్ దూబే, తనుష్ కోటియన్, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, అర్షద్ ఖాన్, ఆయుష్ బదోనీ ఉన్నారు. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రింకూ సింగ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us