
2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు విజయ్ మల్యా తన యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (USL) ద్వారా ఆర్సీబీ జట్టును కేవలం రూ. 446 కోట్లకు కొనుగోలు చేశారు. తన లిక్కర్ బ్రాండ్ ప్రచారానికి క్రికెట్ ను వేదికగా చేసుకోవాలనే ఆయన వ్యూహం అప్పట్లో విమర్శలకు దారితీసినప్పటికీ వ్యాపార పరంగా అది గొప్ప విజయమని నిరూపితమైంది. కేవలం రెండు దశాబ్దాలలోపే జట్టు విలువ వేల కోట్లకు చేరడం విశేషం.
ప్రస్తుత అమ్మకం ద్వారా విజయ్ మల్యాకు ఒక్క రూపాయి కూడా దక్కకపోవడం గమనార్హం. దీనికి కారణం ఆయనకు జట్టులో ఎలాంటి షేర్లు మిగిలి లేకపోవడమే. 2012లో బ్రిటీష్ కంపెనీ ‘డియాజియో’ మల్యాకు చెందిన యునైటెడ్ స్పిరిట్స్ లో 53.4 శాతం వాటాను రూ. 11,166 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలోనే మల్యాకు సుమారు రూ. 3,635 కోట్లు అందాయి.
2013-14 కాలంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంక్షోభంలో పడటంతో మల్యా ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆ తర్వాత డియాజియో తన వాటాను 56 శాతానికి పెంచుకుంది. ఆ సమయంలో మల్యాను ఛైర్మన్ పదవి నుంచి తొలగించినందుకు అదనంగా రూ. 515 కోట్లు చెల్లించారు. 2016లో మల్యా లండన్ కు పారిపోయే సమయానికి ఆర్సీబీ విలువ రూ. 1,200 కోట్లుగా లెక్కగట్టి డియాజియో పూర్తి యాజమాన్య హక్కులను తన వశం చేసుకుంది.
2026లో జరిగిన ఈ తాజా డీల్ ద్వారా వచ్చిన రూ. 16,600 కోట్లు నేరుగా ప్రస్తుతం యాజమాన్య హక్కులు కలిగి ఉన్న యూఎస్ఎల్ (డియాజియో) ఖాతాలోకి వెళ్తాయి. విజయ్ మల్యా ఈ అమ్మకంపై లండన్ నుంచి ట్వీట్ చేసినప్పటికీ ఆర్థికంగా ఆయనకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదు. ఒకప్పుడు తక్కువ ధరకు కొన్న జట్టు నేడు వేల కోట్ల సామ్రాజ్యంగా ఎదగడం ఐపీఎల్ బ్రాండ్ పవర్‌ను చాటిచెబుతోంది. బీసీసీఐ అధికారిక ఆమోదం లభించిన తర్వాత ఆర్సీబీ పూర్తిస్థాయిలో ఆదిత్య బిర్లా గ్రూప్ సొంతం కానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..