
ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ డామినేషన్‌ను కొనసాగిస్తోంది. తమ హోమ్ గ్రౌండ్‌లో తమను ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఇప్పుడు ఆర్సీబీ వాళ్ల హోమ్ గ్రౌండ్ ఢిల్లీలో ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఇది అలాంటి ఇలాంటి విజయం కాదు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అతి పెద్ద విజయం. ఎక్కువ బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఛేజ్ చేసి ఆర్సీబీ ఈ రికార్డ్ సాధించింది. 81 బాల్స్ మిగిలి ఉండగానే 76 పరుగుల టార్గెట్‌ను ఆర్సీబీ ఊదిపారేసింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌ను సంచలన బౌలింగ్‌తో కేవలం 75 పరుగులకే ఆర్సీబీ బౌలర్లు కుప్పకూల్చారు.
అయితే ఈ విజయం ఆర్సీబీ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చినా.. ఒక బాధను మాత్రం తీర్చలేకపోయింది. ఎంతో కాలం వేధిస్తున్న ఓ గాయాన్ని మాన్పించేలా కనిపించిన ఆర్సీబీ బౌలర్లు, చివరికి అది చేయలేకపోయారు. ఇంతకీ అదేంటంటే.. 49 పరుగులకు ఆలౌట్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ చేసిన జట్టుగా ఆర్సీబీపై ఒక మచ్చ ఉండిపోయింది. సోషల్ మీడియాలో ఆర్సీబీని 49 పేరుతో చాలా మంది ట్రోల్ చేస్తుంటారు. ఆ మచ్చను ఈ మ్యాచ్‌తో చెరిపేస్తుందా? అని అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఎందుకంటే తొలి ఓవర్‌లో వికెట్, రెండో ఓవర్‌లో రెండు వికెట్లు, మూడో ఓవర్‌లో మరో రెండు వికెట్లు, నాలుగో ఓవర్‌లో మరో వికెట్ ఇలా.. భువనేశ్వర్ కుమార్, జోష్ హెజల్‌వుడ్ చెలరేగి కేవలం 9 పరుగులకే 6 వికెట్లు కుప్పకూల్చారు.
దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 49 కంటే తక్కువ స్కోర్‌కు ఆలౌట్ చేసి, తమ పేరిట ఉన్న చెత్త రికార్డును డీసీ పేరిట మార్చాలని ఆర్సీబీ అభిమానులు కోరుకున్నారు. కానీ, వారి ఆశలపై నీళ్లు చల్లాడు ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదారు. అద్భుతమైన కెప్టెన్సీతో ఆర్సీబీని తిరుగులేని శక్తిగా నడిపిస్తున్న పాటిదార్ చేసిన ఒక చిన్న తప్పుతోనే 49 రికార్డ్ బ్రేక్ కాలేదని ఆర్సీబీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పాటిదార్ ఏం చేశాడంటే.. అద్భుతమైన బౌలింగ్‌తో డీసీ బ్యాటర్లను పెవిలియన్ బాటపట్టిస్తున్న భువనేశ్వర్ కుమార్, హెజల్‌వుడ్‌లతో స్పెల్ కంటిన్యూ చేయించుకుండా, 7వ ఓవర్ రసిక్‌దార్‌తో, 8వ ఓవర్ షెఫర్డ్‌తో వేయించడమే. అప్పటికే బాల్‌ను అద్భుతంగా స్వింగ్ చేస్తూ భువీ, నిప్పులు చెరిగే పేస్‌తో హెజల్‌వుడ్ చెలరేగుతుంటే వారితోనే బౌలింగ్ కంటిన్యూ చేయించకుండా పవర్‌ప్లే తర్వాత వేరే బౌలర్‌ను ఎటాక్‌లోకి తేవడం ఆర్సీబీ అభిమానులకు నచ్చలేదు.
భువీ, హెజల్‌వుడ్ అప్పటికే మూడేసి ఓవర్లు వేసి పవర్ ప్లేలో 13 పరుగులు మాత్రమే ఇచ్చారు. మిగిలిన ఒక్కో ఓవర్ కూడా వేసి ఉంటే 8 ఓవర్లలోపే డీసీ 49 పరుగుల కంటే తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయి ఉండేదని అభిమానులు వాదిస్తున్నారు. అయితే అప్పటికే మూడేసి ఓవర్లు పవర్‌ప్లేలో బౌలింగ్ భువీ, హెజల్‌వుడ్ అలసిపోయి ఉండొచ్చు. ఈ 49 రికార్డ్ కోసం చూసుకొని వారిపై వర్క్‌లోడ్ ఎక్కువ పెడితే, దాంతో వారు గాయపడితే మొదటికే మోసం వస్తుందని భావించి పాటిదార్ ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. పైగా భువీ, హెజల్‌వుడ్ వేసిన ఇన్నింగ్స్ 5, 6వ ఓవర్లను డీసీ బ్యాటర్లను జాగ్రత్తగా ఆడారు. వారి ఓవర్లలో రిస్క్ తీసుకోవద్దని, వారిని సీఆఫ్ చేయాలని, ఆ తర్వాత వచ్చే బౌలర్లను టార్గెట్ చేయొచ్చని డీసీ బ్యాటర్లు అప్పటికే ఫిక్స్ అయిన భువీ, హెజల్‌వుడ్ బాల్స్‌ను డిఫెన్స్ ఆడటం స్టార్ట్ చేశాడు. అందుకే కెప్టెన్ పాటిదార్ వారి స్పెల్‌లో నాలుగో ఓవర్ వేయించి ఉండకపోవచ్చు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి