Virat Kohli Coments : గులాబి టెస్టు రెండు రోజుల్లో ముగియడానికి రెండు జట్ల బ్యాట్స్‌మెన్ వైఫల్యమే కారణమని చెబుతున్నాడు టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ. నాణ్యమైన బౌలింగ్‌తో తాము ఓటమి పాలయ్యామని ఇంగ్లాండ్ కెప్టెన్ జోరూట్ అంగీకరించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ట కెప్టెన్లు మీడియాతో పలు విషయాలను చర్చించారు. మొతేరా పిచ్ టెస్టు క్రికెట్‌కు సరిపోదన్న మైకేల్ వాన్, హర్భజన్ సింగ్ వంటి క్రికెటర్ల అభిప్రాయాల నేపథ్యంలో కోహ్లీ వివరణ ఇచ్చాడు. ‘నిజాయతీగా చెప్పాలంటే బ్యాటింగ్ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదు. మేం 3 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేశాం. అలాంటిది 150 కన్నా తక్కువకే ఆలౌటయ్యాం. ఏదో ఒక బంతి మాత్రమే అనూహ్యంగా టర్న్ అవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసేందుకు పిచ్ బాగానే ఉంది. 30లో 21 వికెట్లు నేరుగా విసిరిన బంతులకే పడటం విస్మయపరిచింది. మన డిఫెన్స్‌పై నమ్మకం ఉంచుకోవడమే టెస్టు క్రికెట్లో ప్రధానం. సరిగ్గా ఆడటకపోవడంతోనే మ్యాచ్ త్వరగా ముగిసింది’ అని కోహ్లీ అన్నాడు.
మ్యాచులో కీలకంగా రాణించిన రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘జడ్డూకు గాయమైనప్పుడు చాలామంది (ప్రత్యర్థులు) ఊపిరి పీల్చుకున్నారు. కానీ అక్షర్ పటేల్ వచ్చాడు. వేగంగా ఎత్తుమీదుగా బంతులు విసిరాడు. వికెట్ సహకరించిందంటే అక్షర్ అత్యంత ప్రమాదకరంగా మారగలడు. మనం అశ్విన్ ఘనతనూ గుర్తించాల్సి ఉంది. టెస్టు ఫార్మాట్లో ఆధునిక క్రికెట్లో అతడో దిగ్గజం. అతడు నా జట్టులో ఉండటం కెప్టెన్‌గా ఆనందిస్తాను’ అని విరాట్ అన్నాడు. యాష్ 77 టెస్టుల్లోనే 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న సంగతి తెలిసిందే.
టీమ్‌ఇండియా చేతిలో ఘోర ఓటమి క్షమార్హం కాదని ఇంగ్లాండ్ సారథి జో రూట్ అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన శుభారంభాన్ని అందిపుచ్చుకోలేదని అతడు పేర్కొన్నాడు. ‘మేం 70/2తో ఉన్నాం. కానీ దాన్ని మా జట్టు అందిపుచ్చుకోలేదు. ఈ వికెట్‌పై 250 పరుగులు చేసుంటే మరోలా ఉండేది. ఈ ఘోర వైఫల్యం నుంచి మేం మెరుగైన జట్టుగా పుంజుకొని తిరిగొస్తాం. బంతిపై ప్లాస్టిక్ పూత పిచ్‌పై వేగాన్ని అందిపుచ్చుకుంది. టీమ్‌ఇండియా సైతం అత్యుత్తమంగా బంతులు విసిరింది. వికెట్‌పై రెండు జట్లూ ఇబ్బంది పడ్డాయి. గత మ్యాచ్ ఓటమి ఒత్తిడిని మేమిక్కడికి తీసుకురాలేదు. మేం వికెట్లు తీయగలమని అనిపించింది. ఇక నేను ఐదు వికెట్లు తీశానంటే అది పిచ్ వల్లే. వందో మ్యాచ్ ఆడిన ఇషాంత్‌కు అభినందనలు’ అని రూట్ తెలిపాడు.
ఈ దబ్బతో ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమ్‌ఇండియా మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటికే 70% విజయాల రేటుతో ఫైనల్ చేరుకున్న న్యూజిలాండ్‌ను అధిగమించింది. ప్రస్తుతం 71% విజయాల రేటు, 490 పాయింట్లతో నంబర్‌వన్‌గా అవతరించింది. తాజా అపజయంతో ఇంగ్లాండ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ అర్హత రేసులోంచి నిష్క్రమించింది. మొతేరా వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. 49 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీసేన సునాయాసంగా ఛేదించింది.
యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ 11, అశ్విన్ 7 వికెట్లతో ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టారు. ఈ ఓటమితో ఇంగ్లిష్ జట్టు సిరీసులో 1-2తో వెనకబడింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు దూరమైంది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించే అవకాశాలు రెండు జట్లకే ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టును గెలిచినా డ్రా చేసుకున్నా భారత్ 2-1 లేదా 3-1తో ఫైనల్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఇంగ్లాండ్ గెలిస్తే 2-2 సిరీస్ సమం అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను అదృష్టం వరిస్తుంది. అప్పుడు ఆసీస్‌తో కివీస్ పోరాడాల్సి వస్తుంది.
విశాఖ రౌడీ షీటర్ హత్య కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్.. అసలు నిందితుడు ఎవరో కాదు..