
టీ20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు నిరాశాజనకమైన ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. సూపర్ 8 దశ వరకు చేరుకున్నప్పటికీ, కీలక మ్యాచ్‌లలో ఓడిపోయి సెమీ-ఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ దారుణ వైఫల్యం తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆటగాళ్లపై కఠినమైన చర్యలకు ఉపక్రమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, పీసీబీ గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓడిపోయినందుకు గానూ, ప్రతి ఆటగాడికి 50 లక్షల పాకిస్తాన్ రూపాయల(భారత కరెన్సీలో సుమారు 16 లక్షలు) భారీ జరిమానా విధించింది. ఈ జరిమానాను చెల్లించడంలో విఫలమైతే జట్టు నుంచి తొలగిస్తామని కూడా పీసీబీ హెచ్చరించినట్లు తెలుస్తోంది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు వార్తలు వచ్చాయి.
పీసీబీ నిర్ణయంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. మొహ్సిన్ నఖ్వీ తీరును ప్రశ్నిస్తూ, “ఆటగాళ్లు 50 లక్షలు కట్టడం ఎక్కడైనా ఉందా? పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ బుర్ర పనిచేస్తోందా.?” అని మండిపడ్డారు. కొత్త నిబంధనలు తీసుకువచ్చి పాకిస్తాన్ క్రికెట్ వ్యవస్థను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. 50 లక్షల రూపాయల కోసం ఆటగాళ్లు ఎక్కడికి వెళ్ళాలని, డబ్బులు చెట్లకు కాస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా ఆడకపోతే ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి గానీ, డబ్బులు వసూలు చేయడం సరికాదని మాజీలు విమర్శించారు.
ఆటగాళ్ల ప్రదర్శన సరిగ్గా లేకపోతే ఒక్కొక్కరిపై రెండు సంవత్సరాల పాటు వేటు వేయాలని సూచించారు. అలాంటి కఠిన చర్యల ద్వారా మాత్రమే పాకిస్తాన్ ఆటగాళ్లు సరైన దారిలోకి వస్తారని పేర్కొన్నారు. పాకిస్తాన్ జట్టులో ఈ విధమైన సంక్షోభం నెలకొన్న వేళ, టీమిండియా టోర్నమెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తోంది. సూపర్ 8లోని తమ చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై విజయం సాధించి సెమీ-ఫైనల్స్‌లోకి ఘనంగా అడుగుపెట్టింది. అంతేకాకుండా, మూడో టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది చదవండి: ఇక వార్ వన్‌సైడేరోయ్.! సెమీస్‌కు ముందే టీమిండియాకు 5 గుడ్‌న్యూస్‌లు..