Mohsin Naqvi : యూత్ క్రికెట్‌లో పాకిస్తాన్ గెలవగానే ఆసియా కప్ దొంగ ఆనందం మామూలుగా లేదు.. పోస్ట్ వైరల్

యువ క్రికెటర్లు పాల్గొనే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‎లో పాకిస్తాన్ A జట్టు భారత A జట్టును ఓడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Mohsin Naqvi : యూత్ క్రికెట్‌లో పాకిస్తాన్ గెలవగానే ఆసియా కప్ దొంగ ఆనందం మామూలుగా లేదు.. పోస్ట్ వైరల్
Mohsin Naqvi

Updated on: Nov 17, 2025 | 6:08 PM

Mohsin Naqvi : యువ క్రికెటర్లు పాల్గొనే ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‎లో పాకిస్తాన్ A జట్టు భారత A జట్టును ఓడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విజయంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సుదీర్ఘ కాలం తర్వాత భారత్‌పై పాకిస్తాన్ గెలవడంతో నఖ్వీ సంతోషం పట్టలేకపోయారు.

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో పాకిస్తాన్ A టీమ్ (పాకిస్తాన్ షాహీన్స్) అద్భుత ప్రదర్శన చేసింది. ఈ విజయంతో సంతోషపడిన మొహ్సిన్ నఖ్వీ, తమ జట్టును పొగుడుతూ ఒక పోస్ట్ చేశారు. “పాకిస్తాన్ జట్టుకు, పాక్ బోర్డుకు ఇది గర్వించదగిన క్షణం. మా పాకిస్తాన్ షాహీన్స్, ఇండియా A జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించింది. లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే ఛేదించింది. ఇది ఒక అద్భుతమైన ప్రదర్శన. మన యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడారు. పాకిస్తాన్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈ విజయానికి యావత్ దేశానికి అభినందనలు” అని ఆయన రాసుకొచ్చారు.

సీనియర్ జట్టు ఆసియా కప్‌లో ఇటీవల భారత్ చేతిలో మూడు సార్లు ఓడిపోయిన నేపథ్యంలో ఈ జూనియర్ జట్టు విజయం పాక్ క్రికెట్ వర్గాలకు పెద్ద ఊరటగా మారింది. దోహాలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా A జట్టుకు తీవ్ర నిరాశ ఎదురైంది. భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్ద స్కోరు చేయలేకపోయారు. వైభవ్ సూర్యవంశీ (45 పరుగులు), నమన్ ధీర్ (35 పరుగులు) మాత్రమే కాస్త మెరుగ్గా ఆడారు. ఫలితంగా భారత జట్టు కనీసం 20 ఓవర్లు కూడా ఆడకుండానే కేవలం 136 పరుగులకే ఆల్‌అవుట్ అయింది.

137 పరుగుల చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ A జట్టుకు ఓపెనర్ మాజ్ సదాకత్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతను కేవలం 13.2 ఓవర్లలోనే, ఇంకా 40 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో తమ జట్టును గెలిపించాడు. మాజ్ సదాకత్ ఒంటరిగా అజేయంగా 79 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌కి సంబంధించిన మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్‌కు ముందు ఆ తర్వాత కూడా భారత జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్‌షేక్ చేయలేదు. గతంలో జరిగిన 2025 ఆసియా కప్ అలాగే మహిళల వరల్డ్ కప్ మ్యాచ్‌లలో కూడా భారత జట్టు ఇలాగే నో హ్యాండ్‌షేక్ విధానాన్ని పాటించింది. ఈ యువ టోర్నీలో కూడా అదే పద్ధతిని కొనసాగించడం ఇప్పుడు ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..