
David Warner: విరాట్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టేందుకు బాబర్ ఆజం చాలా దగ్గరగా వచ్చాడు. కానీ, సెమీఫైనల్లో పాకిస్థాన్ ఓటమి తర్వాత విరాట్ రికార్డును బద్దలు కొట్టలేడని తేలిపోయింది. అయితే పాకిస్థాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ మాత్రం విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసేందుకు చేరువయ్యాడు.
టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ పేరుతోనే నిలిచింది. 2014 ప్రపంచకప్‌లో 319 పరుగులు సాధించిన విరాట్ కోహ్లీ.. ఓ ప్రపంచకప్‌లో అత్యధికంగా పరుగులు సాధించిన లిస్టులో తొలి స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత 2009లో శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ 317 పరుగులతో ఓ దశలో విరాట్ రికార్డును బ్రేక్ చేసేందుకు దగ్గరయ్యాడు. కానీ రెండు పరుగుల దూరంలో నిలిచి రెండో స్థానంలో నిలిచాడు. ఇక 6 మ్యాచ్‌ల్లో 303 పరుగులు చేసిన పాకిస్తాన్ కెప్టెన్ బాబర్.. విరాట్ రికార్డును చెరిపేసేందుకు సిద్ధమైనట్లే కనిపించాడు. కానీ, సెమీఫైనల్‌లో పాక్ జట్టు ఓటమితో ఈ అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ 2021 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టగల ఏకైక బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ రూపంలో ప్రమాదం పొంచి ఉంది. అయితే, దీని కోసం అతను ఫైనల్లో 84 పరుగులు చేయాల్సి ఉంటుంది. డేవిడ్ వార్నర్ ప్రస్తుతం 6 మ్యాచ్‌ల్లో 234 పరుగులు చేశాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన నాల్గవ ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.
టీ20 ప్రపంచ కప్ 2021లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లలో సెమీ-ఫైనల్ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ ఓపెనర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 303 పరుగులతో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. మహ్మద్ రిజ్వాన్ 281 పరుగులతో రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లండ్‌కు చెందిన జోస్ బట్లర్ 6 మ్యాచ్‌ల్లో 269 పరుగులు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ 6 మ్యాచ్‌ల్లో 236 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. అదే సమయంలో, శ్రీలంకకు చెందిన అసలంక 6 మ్యాచ్‌ల్లో 231 పరుగులతో 5వ స్థానంలో నిలిచాడు.
Watch Video: ఆసీస్ చేతిలో ఘోర ఓటమి.. అనంతరం పాక్ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే? వీడియో మీకోసమే.!