
Pakistan : ఆసియా కప్ 2025లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. భారత్తో జరిగిన మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదంతో ఐసీసీకి ఫిర్యాదు చేసిన పీసీబీ, ఇప్పుడు తమ సొంత మాజీ క్రికెటర్ విమర్శలతో ఇబ్బందుల్లో పడింది. పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అతీక్-ఉజ్-జమాన్, పాకిస్తాన్ ఆటగాళ్ల జెర్సీ క్వాలిటీ చాలా తక్కువగా ఉందని, దీని వెనుక పీసీబీలో ఉన్న అవినీతి ఉందని తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మాజీ క్రికెటర్ ఆరోపణలు
అతీక్-ఉజ్-జమాన్ తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో ఒక పోస్ట్ చేశారు. అందులో “పాకిస్తాన్ ఆటగాళ్లు చెమటలు పట్టేలా తక్కువ క్వాలిటీ గల జెర్సీలు ధరిస్తుండగా, ఇతర జట్ల ఆటగాళ్లు మంచి డ్రై-ఫిట్ జెర్సీలు ధరిస్తున్నారు. టెండర్లు నిపుణులకు కాకుండా.. స్నేహితులకు ఇస్తే ఇలాగే జరుగుతుంది. చెమట కంటే అవినీతి ఎక్కువగా పడుతోంది” అని ఆయన రాశారు. ప్లేయర్లు క్వాలిటీ లేని జెర్సీలు ధరించడం వల్ల అధికంగా చెమట పడుతుందని, అది వారి ప్రదర్శనపై కూడా ప్రభావం చూపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అతీక్-ఉజ్-జమాన్ ఎవరు?
అతీక్-ఉజ్-జమాన్ పాకిస్తాన్ మాజీ క్రికెటర్. అతను పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 69 మ్యాచ్‌లు ఆడి మూడు సెంచరీలతో 2521 పరుగులు సాధించాడు. ప్రస్తుతం అతను జర్మనీ క్రికెట్ జట్టుకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2023లో అతనికి ఈ బాధ్యతలు అప్పగించారు.
పాకిస్తాన్ వివాదాల పరంపర
ఆసియా కప్‌లో పాకిస్తాన్ తన ఆట కంటే వివాదాల కారణంగానే ఎక్కువగా చర్చల్లో నిలుస్తోంది. ఇటీవల భారత్తో జరిగిన మ్యాచ్ తర్వాత హ్యాండ్‌షేక్ వివాదాన్ని ఐసీసీ వరకు తీసుకెళ్లింది. మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ్ చేసింది. కానీ ఐసీసీ అందుకు నిరాకరించడంతో, పాకిస్తాన్ బెదిరింపులు కూడా పనిచేయలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు సూపర్-4లో అడుగుపెట్టింది. సెప్టెంబర్ 21న సూపర్-4 మ్యాచ్‌లో మళ్లీ భారత్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ చేసిన ఈ కొత్త ఆరోపణలు పాక్ క్రికెట్‌కు మరో తలనొప్పిని తెచ్చిపెట్టాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..