
PAK vs SA : వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 సైకిల్‌ను పాకిస్థాన్ జట్టు ఘనంగా ప్రారంభించింది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో, మొదటి రోజే పాకిస్థాన్ బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా కెప్టెన్ షాన్ మసూద్, ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కలిసి ఏకంగా 25 ఏళ్ల నాటి అరుదైన రికార్డును సమం చేశారు. టెస్ట్ మ్యాచ్‌లోనూ దూకుడుగా ఆడొచ్చని నిరూపిస్తూ, T20 తరహాలో పరుగులు రాబట్టారు.
25 ఏళ్ల రికార్డు సమం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షాన్ మసూద్, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కలిసి తొలి 10 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టానికి 51 పరుగులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. టెస్టు క్రికెట్‌లో పాకిస్థాన్ ఇంత వేగంగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఇంతకుముందు 2000 సంవత్సరంలో ఇంగ్లండ్‌పై ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్ తొలి 10 ఓవర్లలో ఒక వికెట్‌కు 51 పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిది పాక్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
అద్భుత భాగస్వామ్యం.. కానీ సెంచరీలు మిస్
తొలి వికెట్ త్వరగా కోల్పోయినా, కెప్టెన్ షాన్ మసూద్, ఇమామ్ ఉల్ హక్ పాక్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 161 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో కెప్టెన్ షాన్ మసూద్ 147 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 76 పరుగులు చేసి స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కెప్టెన్ ఔటైన కాసేపటికే ఇమామ్ ఉల్ హక్ కూడా పెవిలియన్ చేరాడు. అతను 157 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 93 పరుగులు చేసి, కేవలం ఏడు పరుగుల తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. సెనురన్ ముత్తుసామి అతడిని ఔట్ చేశాడు. కీలకమైన ఇద్దరు బ్యాటర్లు స్వల్ప వ్యవధిలో ఔటవ్వడంతో పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఒక్కసారిగా తడబడింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..