అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్క ఆటగాడికి ఏదొక కల ఉంటుంది. సెంచరీలు కొట్టాలని కొందరు అనుకుంటే.. ఐసీసీ మెగా టోర్నమెంట్లలో భాగం కావాలని మరికొందరు.. నెంబర్ వన్ ర్యాంక్ పొందాలని ఇంకొందరు భావిస్తారు. కానీ ఇవన్నీ దక్కించుకునేందుకు కృషి, అదృష్టం రెండూ ఉండాలి. ఆస్ట్రేలియాకు చెందిన గ్యారీ గిల్మర్ వారిలో ఒకరు. కేవలం 5 వన్డేలు ఆడి, 200 మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కూడా అందుకొని ఫీట్ సాధించాడు. 1951లో జూన్ 26న జన్మించాడు గిల్మర్. 62 ఏళ్లకే మరణించిన అతడు.. క్రికెట్‌లో ఎన్నో గొప్ప విజయాలు అందుకున్నాడు.
తన స్కూల్ డేస్ నుంచి ఆస్ట్రేలియా జట్టుకు ఆడటం ప్రారంభించాడు గిల్మర్. ఫస్ట్ క్లాస్ అరంగేట్రం 1972 సంవత్సరంలో న్యూ సౌత్ వేల్స్ తరపున అరంగేట్రం చేసిన గిల్మర్.. తన మొదటి మ్యాచ్‌ను సౌత్ ఆస్ట్రేలియాతో ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ ఎంట్రీ తర్వాత.. సరిగ్గా ఏడాది అనగా 1973 సంవత్సరంలో, ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్‌తో తొలి టెస్టు ఆడాడు. గిల్మర్ టెస్టు అరంగేట్రం.. అతడి కెరీర్‌నే మలుపు తిప్పింది. ఏకంగా 1975 ప్రపంచకప్ జట్టుకు ఎంపికయ్యాడు.
గ్యారీ గిల్మర్ 1975 వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించాడు. అంతకముందు అతడు ఆస్ట్రేలియా తరపున కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడాడు. ఈ మెగా టోర్నమెంట్ సెమీ-ఫైనల్‌లో గిల్మర్ బరిలోకి దిగాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో గిల్మర్ 14 పరుగులకే 6 వికెట్లు పడగొట్టాడు. ఆ సమయంలో 12 ఓవర్లలో ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అనంతరం వెస్టిండీస్‌కు చెందిన విన్‌స్టన్ డేవిస్ 1983 ప్రపంచకప్‌లో 7 వికెట్లు తీసి.. గిల్మర్ రికార్డు బద్దలుకొట్టాడు. ఫైనల్‌లోనూ గిల్మర్ ఇదే ప్రదర్శన కనబరిచాడు. ఈసారి వెస్టిండీస్‌పై 48 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక్కడ గొప్ప విషయమేమిటంటే, చాలామంది క్రికెటర్లు తమ కెరీర్ మొత్తంలో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడినా.. ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. కానీ, గిల్మర్ కేవలం 2 మ్యాచ్‌లు ఆడిన వెంటనే ఈ ఘటన సాధించాడు. అయితే, 1975 ప్రపంచకప్ తర్వాత, మరో వన్డే మాత్రమే ఆడగలిగాడు గిల్మర్. అతడు 1977లో ఇంగ్లాండ్‌తో తన కెరీర్‌లో చివరి, 5వ ODI ఆడాడు.
గ్యారీ గిల్మర్ చివరి వన్డే ఆడిన సంవత్సరంలోనే, న్యూజిలాండ్ పర్యటనలో గిల్మర్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలి బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడ్డాయి. డగ్లస్ వాల్టర్స్‌తో క్రీజులో ఉన్న గిల్మర్.. తొలి రోజు హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఈ ఇద్దరు బ్యాటర్లు రాత్రంతా మద్యం సేవించారు. మరుసటి రోజు బ్యాటింగ్‌కు మత్తులో వెళ్లారు. ఈ క్రమంలోనే ఫుల్ కిక్కులో సెంచరీ బాదేశాడు గిల్మర్. అతడు 146 బంతుల్లో 101 పరుగులు చేసి సెంచరీ పూర్తి చేశాడు. ఇది అతడి టెస్ట్ కెరీర్‌లో మొదటి సెంచరీ.