అధ్వానంగా మారిన ఉత్తరాఖండ్ క్రికెటర్ల బతుకులు.. రోజూవారీ కూలీల కంటే తక్కువగా జీతాలు..

|

Jun 10, 2022 | 10:10 AM

కర్నాటకలోని ఆలూర్‌లో జరిగే 2021-22 రంజీ ట్రోఫీ క్వార్టర్-ఫైనల్‌కు ముందు రోజు , ఉత్తరాఖండ్ 41 సార్లు టోర్నమెంట్ విజేత ముంబైతో..

అధ్వానంగా మారిన ఉత్తరాఖండ్ క్రికెటర్ల బతుకులు.. రోజూవారీ కూలీల కంటే తక్కువగా జీతాలు..
Uttarakhand Cricketers
Follow us on

బీసీసీఐ వార్షిక వేతనం.. ఐపీఎల్ ఇన్‌కమ్.. యాడ్స్ ద్వారా వచ్చే మనీ.. ఇలా ఒకటేమిటీ క్రికెటర్లు వార్షికంగా సంపాదించేది కోట్లలో ఉంటది. ఇది అందరూ ఊహించుకునేది. అయితే కొంతమంది క్రికెటర్ల బ్రతుకులు.. రోజూవారి కూలీల జీవితం కంటే అద్వానంగా ఉంటాయి. అది కూడా ఆయా క్రికెట్ బోర్డులు చేసే అక్రమాల కారణంగా ఇలా జరుగుతుంది. మరి అలా తమ జీవితాన్ని పేదరికంగా గడుపుతున్న కొంతమంది క్రికెటర్ల గురించి.. ఆ బోర్డు చేసిన అవకతవకల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇటీవల జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరాఖండ్‌ను 725 పరుగుల తేడాతో ముంబై ఓడించి.. ప్రపంచ రికార్డు నెలకొల్పడమే కాదు.. అద్భుత విజయాన్ని కూడా నమోదు చేసిన సంగతి తెలిసిందే. మాజీ క్రికెటర్లు, క్రీడా పండితులు కొంతమంది ఉత్తరాఖండ్ ఆడిన ఆటతీరుకు విమర్శలు గుప్పించవచ్చు. అయితే ఆ జట్టులోని క్రికెటర్ల బ్రతుకుల గురించి తెలిస్తే మాత్రం జాలిపడక మానరు.

ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడున్‌లో డైలీ వేజ్ వర్కర్లకు రోజుకు వేతనంగా రూ. 800 ఇస్తారు. ఇక ఆ వేతనంతో వారి బ్రతుకులు అంతంతమాత్రంగా కొనసాగుతాయి. కానీ ఇక్కడ ఆ రాష్ట్ర ప్లేయర్స్ బ్రతుకులు మరీ అధ్వానం. వారికి కేవలం రోజుకి వేతనం కింద రూ. 100 అందుతోంది. ఆ డైలీ అలవెన్స్‌తోనే క్రికెటర్లు ప్రస్తుతం రంజీ టోర్నమెంట్‌లో పాల్గొన్నారు. డీఏలు సమయానికి అందకపోవడంతో.. టోర్నీ అంతటా చాలామంది క్రికెటర్లు పస్తులతో గడిపారు. ఆకలితో అలమటిస్తూ మ్యాచ్‌లు ఆడుతున్నారు. టోర్నీ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా.? డెహ్రాడున్ ఎప్పుడు చేరాతామా.? అన్నట్లుగా నిద్రలేని రాత్రులు గడిపారు. ఎంతలా వారి ఆకలి బాధలు ఉన్నాయంటే.. పలువురు క్రికెటర్లు టీం మేనేజర్ వద్దకు వెళ్లి జోమాటో/ స్విగ్గీలలో ఫుడ్ ఆర్డర్ పెట్టమన్న రోజులు ఉన్నాయని చెప్పడం అతిశయోక్తి లేదు.

ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఆటగాళ్ళకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించలేదని తెలుస్తోంది. అలసిపోయి, ఆకలితో అలమటిస్తూ మానసిక వేదనను అనుభవిస్తున్న ఉత్తరాఖండ్ ఆటగాళ్లు.. ఆ క్వార్టర్ ఫైనల్స్‌లో కేవలం 69 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక ఈ టోర్నీ అంతటా ఉత్తరాఖండ్ క్రికెటర్ల అధ్వాన పరిస్థితిపై న్యూస్ 9 ఓ ఇన్వెస్టిగేటివ్ కథనాన్ని ప్రచురించింది.

“సీనియర్ క్రికెటర్లకు ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు డైలీ అలవెన్స్ కింద రూ. 1500 చెల్లించాల్సి ఉండగా.. ఇటీవలే దాన్ని రూ. 2 వేలకు పెంచారు’. అయితే వాస్తవానికి, గత 12 నెలలుగా క్రికెటర్లకు సగటున రోజుకు రూ. 100 మాత్రమే ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు ఇస్తోందని నివేదిక పేర్కొంది. నిధుల కొరత, అవినీతి, అవకతవకలు, రాజకీయ ప్రలోభాలు వెరిసి.. ఆ రాష్ట్ర క్రికెటర్లను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

మరోవైపు 2021 ఆర్ధిక సంవత్సరంలో ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ (CAU) తన ఆడిట్ నివేదికలో పలు సంచలన విషయాలను పేర్కొంది. ఆటగాళ్ల కొరకు వివిధ సందర్భాల్లో రూ. 2.8 కోట్లు ఖర్చు పెట్టినట్లుగా పేర్కొంది. అయితే ఆటగాళ్లు మాత్రం రోజుకు కేవలం రూ. 100 మాత్రమే పొందుతున్నారు. కాగా, గురువారం ముంబై ఉత్తరాఖండ్‌ను ఓడించి ప్రపంచ రికార్డు సృష్టించింది. అయితే ఈ ఓటమితో ఉత్తరాఖండ్ క్రికెట్‌ బోర్డులో గత కొంతకాలంగా జరుగుతోన్న అవకతవకలు బయటపడటమే కాదు.. మేనేజ్‌మెంట్ మానసిక వేధింపులు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఉత్తరాఖండ్ క్రికెట్ బోర్డు అక్రమాలపై లోతైన వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి…