Zaheer Khan: భారత క్రికెట్ జట్టు(Indian Cricket Team)లో అత్యంత విజయవంతమైన ఫాస్ట్ బౌలర్ల గురించి మాట్లాడితే, అందులో జహీర్ ఖాన్(Zaheer Khan) పేరు తప్పకుండా ఉంటుంది. ఈ లెఫ్టార్మ్ బౌలర్ తన వేగవంతమైన బంతులతో జట్టుకు ఎన్నో విజయాలు అందించి మ్యాచ్ విన్నింగ్ ప్లేయర్‌గా ఎదిగాడు. జహీర్ 2003 ప్రపంచ కప్‌లో భారతదేశం తరపున ఆడాడు. దీనిలో జట్టు ఫైనల్స్‌కు చేరుకుంది. కానీ, ఓడిపోయింది. 2011లో అయితే తన కలను సాకారం చేసుకుని టీమిండియా వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ ఆటగాడు తన ఆట గురించి ఎంత సీరియస్‌గా ఉంటాడో, మైదానం వెలుపల మాత్రం చాలా సరదాగా ఉంటాడు. ఈ రోజు మేం మా ప్రత్యేక సిరీస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ (Old is Gold)లో జహీర్ చిన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను గురించి మీముందుకు తీసుకొచ్చాం. మరణం అంచులదాకా వెళ్లి వచ్చిన జహీర్.. అనంతరం టీమిండియాలో చేరి తన స్పీడ్ బౌలింగ్‌తో ఎన్నో విజయాలు అందించాడు. ఈ సిరీస్‌లో మేం పాత వీడియోల నుంచి ఆసక్తికరమైన కథనాలను మీకు అందిస్తున్నాం.
మైదానం లోపల జహీర్ దూకుడు అందరికీ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే మైదానం వెలుపల అతను చాలా సరదాగా ఉండే ఆటగాడు. తనతో ఆడిన యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ఈ విషయాన్ని చాలాసార్లు వెల్లడించారు. చిన్నప్పటి నుంచి అల్లరి చేసేవాడంట.
నీటిలో మునిగిపోయిన జహీర్..
మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లా శ్రీరాంపూర్ గ్రామంలో జహీర్ నివసించేవాడు. అతని తండ్రి ఓ ఫోటోగ్రాఫర్. అతను తన తండ్రితో కలిసి కాలువ చూడటానికి వెళ్ళాడు. ఆ సమయంలో ప్రమాదం జరిగింది. అతని చిలిపి చేష్టలను గుర్తుచేసుకుంటూ, జహీర్ BBCలో వచ్చిన ఓ షోలో ఫేస్ టు ఫేస్‌లో దీనిపై మాట్లాడుతూ, “నా అన్నయ్య, నేను కాలువ మెట్ల మీద నిలబడి ఉన్నాం. మేం చివరి మెట్టులో ఉన్నాం. అయితే అక్కడ ఒక నిచ్చెన ఉండడంతో నా కాలు దానిపై ఉంచాను. ఆ వెంటనే నేను పడిపోయాను. దాదాపు నీళ్లలో మునిగిపోయాను. మా మామయ్య కాపాడడంతో నేను బతికాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
అమ్మమ్మ చెప్పినా వినకుండా కరెంట్ తీగ పట్టుకున్నా..
అదేవిధంగా జహీర్‌కు మూడేళ్లు ఉన్నప్పుడు అమ్మమ్మ చెప్పిన ఓ మాట వినలేదు. అదే ఇంటర్వ్యూలో జహీర్ మాట్లాడుతూ, “నాకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను చూసుకునేది. కరెంటు తీగ వేలాడుతున్నదని, తన దగ్గరికి వెళ్లవద్దని చెప్పింది. కరెంటు తీగ అంటే ఏమిటో తెలుసుకోవాలనిపించి అక్కడికి వెళ్లి తాకాను. షాక్ కొట్టడంతో కింద పడిపోయాను” అంటూ ఆనాటి సంగతులు చెప్పుకొచ్చాడు.
జహీర్ ఖాన్ కెరీర్..
భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో జహీర్ రెండో స్థానంలో ఉన్నాడు. జహీర్ 194 వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. ముంబైకి చెందిన అజిత్ అగార్కర్ అతని కంటే ముందున్నాడు. అగార్కర్ 191 మ్యాచ్‌ల్లో 288 వికెట్లు తీశాడు. అతని టెస్ట్ కెరీర్‌ను పరిశీలిస్తే, జహీర్ భారతదేశం తరపున 92 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అతని పేరు మీద 311 వికెట్లు ఉన్నాయి. టీ20లో భారత్ తరఫున 17 మ్యాచ్‌లు ఆడి 17 వికెట్లు పడగొట్టాడు.
Also Read:
ICC U19 World Cup: వరుసగా నాలుగోసారి ఫైనల్ చేరిన భారత్.. ఆస్ట్రేలియాపై ఘన విజయం..!