ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ

ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్స్ తేదీలను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు 10 జట్ల మధ్య పోటీ జరగనుంది. వెస్టిండీస్‌కు మరోసారి క్వాలిఫైయర్ ముప్పు పొంచి ఉంది. భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్ ఫలితాలు విండీస్ ప్రపంచకప్ అవకాశాలను ప్రభావితం చేయనున్నాయి.

ODI World Cup: 2027 వన్డే ప్రపంచకప్‌కు కౌంట్‌డౌన్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ
Odi World Cup

Updated on: Aug 05, 2026 | 6:18 PM

ODI World Cup: వచ్చే ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక 2027 వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సంబంధించి ఐసీసీ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ టోర్నీకి అర్హత సాధించేందుకు నిర్వహించే క్వాలిఫైయర్స్ మ్యాచ్‌ల తేదీలను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 10 జట్లు పాల్గొనే ఈ క్వాలిఫైయర్ రౌండ్ 2027 ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌లను ఏ దేశంలో లేదా ఏ వేదికల్లో నిర్వహిస్తారనే దానిపై ఐసీసీ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కొత్త ఫార్మాట్‌లో 14 జట్ల సమరం

ఈసారి జరగబోయే వన్డే ప్రపంచకప్‌ను ఐసీసీ సరికొత్త ఫార్మాట్‌లో నిర్వహించబోతోంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 14 జట్లు పోటీపడనున్నాయి. క్వాలిఫైయర్‌లో గెలిచిన టాప్ టీమ్ నేరుగా ఈ 14 జట్ల ప్రధాన గ్రూప్‌లో చోటు దక్కించుకుంటుంది. ఇక క్వాలిఫైయర్స్ పాయింట్ల పట్టికలో రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్ల మధ్య సూపర్ సిరీస్ పోరు జరుగుతుంది. ఇది ప్రపంచకప్ మొదటి రౌండ్‌గా పరిగణించబడుతుంది. ఈ రౌండ్‌లో విజయం సాధించిన జట్లు ఆ తర్వాత టాప్-12 లోకి అడుగుపెడతాయి.

మూడు దేశాల ఉమ్మడి ఆతిథ్యం

ఈసారి వన్డే ప్రపంచకప్ టోర్నమెంట్ మూడు ఆఫ్రికన్ దేశాల ఉమ్మడి ఆతిథ్యంలో జరగనుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలిసి ఈ టోర్నీని నిర్వహించనున్నాయి. టోర్నీలోని మొత్తం మ్యాచ్‌లను 12 వేర్వేరు స్టేడియంలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో అత్యధికంగా 8 వేదికలు సౌతాఫ్రికాలోనే ఉన్నాయి. మిగిలిన వాటిలో 3 వేదికలు జింబాబ్వేలో, 1 వేదిక నమీబియాలో ఉన్నాయి. మెయిన్ ప్రపంచకప్ మ్యాచ్‌లు 2027 అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు జరగనున్నాయి.

క్వాలిఫైయర్‌లో పోటీపడే 10 జట్లు ఇవే

క్వాలిఫైయర్ రౌండ్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. సెప్టెంబర్ 30, 2026 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో చివరన ఉండే రెండు ఫుల్ మెంబర్ జట్లు (ఆతిథ్య దేశాలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలు మినహా) ఈ క్వాలిఫైయర్‌లో ఆడాల్సి ఉంటుంది. వీరితో పాటు సిడబ్ల్యూసి లీగ్ 2లో టాప్-4 లో నిలిచిన జట్లు, అలాగే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ ప్లేఆఫ్స్‎లో టాప్-4 లో నిలిచిన జట్లు కలసి మొత్తం 10 జట్లు ఈ క్వాలిఫైయర్స్ లో తలపడతాయి.

వెస్టిండీస్ జట్టుకు మళ్లీ తప్పని క్వాలిఫైయర్స్ గండం

గత 2023 వన్డే ప్రపంచకప్‌లో క్వాలిఫైయర్ రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ ఛాంపియన్ వెస్టిండీస్‌కు మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో విండీస్ 10వ స్థానంలో ఉంది. సెప్టెంబర్ 30 కట్-ఆఫ్ తేదీకి ముందు కరేబియన్ జట్టు కేవలం 2 వన్డేలు మాత్రమే ఆడనుంది (అవి భారత్‌తో జరగనున్నాయి). అటు అఫ్గానిస్థాన్, ఐర్లాండ్ మధ్య జరిగే వన్డే సిరీస్ ఫలితాలు కూడా వెస్టిండీస్ భవిష్యత్తును శాసిస్తాయి. ఐర్లాండ్ 4-1 లేదా 5-0 తో గెలిచి, వెస్టిండీస్ భారత్‌పై రెండు వన్డేల్లోనూ విజయం సాధిస్తేనే కరేబియన్ జట్టు నేరుగా టాప్-8 కి చేరుకునే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us