NZ20 League : కివీస్ గడ్డపై టీ20 లీగ్ సందడి.. ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్

New Zealand NZ20 League : జనవరి 2027 నుంచి న్యూజిలాండ్ తన సొంత టీ20 లీగ్ NZ20ని ప్రారంభించనుంది. 6 జట్లు, ప్రైవేట్ ఓనర్లతో ఐపీఎల్ తరహాలో ఈ టోర్నీ జరగనుంది. మహిళల క్రికెట్ లీగ్ కూడా దీనిలో భాగంగా ఉంటుంది.

NZ20 League : కివీస్ గడ్డపై టీ20 లీగ్ సందడి.. ఐపీఎల్ తరహాలో NZ20ని ప్రకటించిన న్యూజిలాండ్ క్రికెట్

Updated on: Mar 23, 2026 | 3:41 PM

New Zealand NZ20 League : భారతదేశంలో ఐపీఎల్ (IPL) సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే బాటలో ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌ల హవా నడుస్తోంది. ఆస్ట్రేలియాలో బిగ్ బాష్, యూఏఈలో ఐఎల్ టీ20, అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ ఇలా ప్రతి దేశం తమకంటూ ఒక సొంత బ్రాండ్‌ను సృష్టించుకుంటున్నాయి. తాజాగా ఈ రేసులోకి క్రికెట్ అంటే ఎంతో క్రమశిక్షణతో ఆడే న్యూజిలాండ్ కూడా చేరింది. ఇప్పటివరకు అక్కడ జరుగుతున్న సూపర్ స్మాష్ స్థానంలో సరికొత్త హంగులతో NZ20 ఫ్రాంచైజీ లీగ్‌ను ప్రారంభించాలని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న దేశీయ టీ20 టోర్నమెంట్ సూపర్ స్మాష్ స్థానంలో NZ20 పేరుతో ఒక ఫ్రాంచైజీ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు ఉంటాయి. ఐపీఎల్ తరహాలోనే ఈ జట్లకు ప్రైవేట్ యజమానులు ఉంటారు. జనవరి 2027లో ఈ లీగ్ అట్టహాసంగా ప్రారంభం కానుంది. కేవలం పురుషుల క్రికెట్ మాత్రమే కాకుండా, మహిళల క్రికెట్‌ను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మహిళల టీ20 లీగ్‌ను కూడా దీనిలో భాగంగా నిర్వహించనున్నారు.

న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు అధ్యక్షురాలు లిండన్ మాట్లాడుతూ.. ఈ లీగ్ కేవలం వినోదం కోసమే కాకుండా స్థానిక యువ క్రికెటర్లకు ఒక గొప్ప వేదిక కావాలని ఆకాంక్షించారు. ప్రతి టీమ్‌లో స్థానిక స్టార్ క్రికెటర్లు ఉండాలని, తద్వారా యువ ఆటగాళ్లు తమ హీరోలతో కలిసి ఆడుతూ నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు. మొదట్లో ఆస్ట్రేలియాలోని బిగ్ బాష్ లీగ్‎లో న్యూజిలాండ్ జట్లను చేర్చాలని చర్చలు జరిగినప్పటికీ, చివరికి తమకంటూ ఒక సొంత లీగ్ ఉండటమే మేలని బోర్డు నిర్ణయించుకుంది.

న్యూజిలాండ్‌లో క్రికెట్ కంటే రగ్బీకి ఎక్కువ ఆదరణ ఉంటుంది. అయితే, ప్రైవేట్ ఇన్వెస్టర్లు క్రికెట్ లీగ్‌లోకి రావడం వల్ల బోర్డుకు భారీగా ఆదాయం సమకూరనుంది. ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఎలాగైతే ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా ఎదిగిందో, న్యూజిలాండ్ కూడా అదే బాటలో నడవాలని చూస్తోంది. ఆర్థికంగా బలం చేకూరితే, క్రికెటర్లకు ఇచ్చే పారితోషికాలు కూడా పెరుగుతాయి, తద్వారా ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల వైపు మొగ్గు చూపకుండా తమ దేశం తరపున ఆడేందుకు ప్రాధాన్యత ఇస్తారు.

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా (SA20), పాకిస్థాన్ (PSL), బంగ్లాదేశ్ (BPL), వెస్టిండీస్ (CPL) వంటి లీగ్‌లు ఇప్పటికే సక్సెస్ అయ్యాయి. ఈ లీగ్‌ల వల్ల కొత్త టాలెంట్ వెలుగులోకి రావడమే కాకుండా, క్రికెట్ గ్లోబల్ మార్కెట్ కూడా పెరుగుతోంది. న్యూజిలాండ్ కూడా ఈ కొత్త లీగ్‌తో గ్లోబల్ క్రికెట్ మ్యాప్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఐపీఎల్ టీమ్ ఓనర్లు ఎవరైనా కివీస్ లీగ్‌లో జట్లను కొనుగోలు చేస్తారేమో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us