Most Googled Cricketers 2023: కోహ్లీ, రోహిత్‌ కాదు.. గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికింది ఇతడినే..

|

Dec 14, 2023 | 3:14 PM

పంజాబీ బుల్లోడు.. క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్‌పై ప్రకంపనలు సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్‌లో బాల్ బాల్‌కి బ్యాండ్ బాజా మోగించడమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచకప్‌లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు.

Most Googled Cricketers 2023: కోహ్లీ, రోహిత్‌ కాదు.. గూగుల్‌లో ఈ ఏడాది ఎక్కువగా వెతికింది ఇతడినే..
Team India
Follow us on

పంజాబీ బుల్లోడు.. క్రికెట్ అంటే పిచ్చున్నోడు. అందుకే పిచ్‌పై ప్రకంపనలు సృష్టించాడు. ఆటంటే ఇది అని ఆడి చూపించాడు. క్రికెట్ అంటే ప్రాణం. అందుకే గ్రౌండ్‌లో బాల్ బాల్‌కి బ్యాండ్ బాజా మోగించడమంటే ఇష్టం. అప్పుడెప్పుడో 2018లోనే అండర్-19 ప్రపంచకప్‌లో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అందులో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ. పైగా మనకు ఆ ట్రోఫీ వచ్చేలా చేసింది. వాళ్లు పోతే వీళ్లు.. వీళ్లు పోతే వాళ్లు కాదు.. సరైనోడు వచ్చాడు. ఆ ఆటగాడి పేరు చెబితేనే ఫ్యాన్స్ గుండె జిల్ మంటుంది. అతడే.. శుభ్‌మన్ గిల్. ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసింది గిల్ గురించే. అందుకే ఆ లిస్టులో సెకండ్ ప్లేస్ కొట్టేశాడు. ఈ ఒక్క లెక్క పక్కాగా చాలు. గిల్ అంటే ఏంటో చెప్పడానికి.

వన్డే ర్యాంకింగ్స్‌లో ఫస్ట్ ప్లేస్ కొట్టడమంటే.. గిల్‌కు చాలా ఇష్టం. అదే అతడిని టీమ్ ఇండియా యువరాజుగా నిలబెట్టింది. 1988లో వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ప్రపంచ నెంబర్ వన్ వన్డే ఆటగాడిగా కేవలం నలుగురంటే నలుగురే టీమ్ ఇండియా నుంచి నిలిచారు. వారిలో మొదటి ముగ్గురు సచిన్, ధోనీ, కోహ్లీ. మిగిలిన ఆ నాలుగోవాడే … శుభ్‌మన్ గిల్. సచిన్, ధోనీ ఆటకు బైబై చెప్పేశారు. కోహ్లీకేమో 35 ఏళ్లు వచ్చేశాయి. అందుకే నవ యవ్వనంతో.. సొగసైన ఆటతీరుతో దూసుకుపోతున్న గిల్ వైపే అందరి చూపు ఉంది. ఇదే మనవాడిని గూగుల్‌లో హీరోను చేసింది.

టీ20లు ఆడితే ధనాధన్ షాట్స్ వస్తాయి. అదే వన్డేల్లో ఆడితే క్రీజులో నిలబడడానికి ప్రయార్టీ ఇస్తాడు. ఇక టెస్టుల్లో అయితే పెద్ద వాల్‌లా నిలుస్తాడు. శుభ్‌మన్ గిల్ నుంచి.. తన ఫ్యాన్స్ ఎక్కువగా కోరుకునే షాట్ ఏమిటో తెలుసా? మిడ్ వికెట్ మీదుగా ఫోర్ కోసం కొట్టే హాఫ్ వ్యాలీ షాట్. ఈ ఒక్క షాట్ కోసం.. ఫ్యాన్సంతా పిచ్చపిచ్చగా ఎదురుచూస్తారు. ఆ షాట్ చూస్తే.. భలే భలే భలే అని మనోడిని పొగడకుండా ఉండలేరు. 2019లో వన్డేల్లో అరంగేట్రం చేసినా.. అప్పట్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండేది. కరోనా వల్ల మ్యాచ్‌లు సరిగా ఆడలేదు. అందుకే 2022 జూలై వరకు కేవలం మూడు వన్డేల్లో మాత్రమే ఆడాడు. కానీ ఆ తరువాత ఆడే ప్రతీ మ్యాచ్‌లో పరుగుల దాహాన్ని తీర్చుకుంటూనే ఉన్నాడు. ఉన్న ప్లేస్‌ను కాపాడుకోవడం, తోటి క్రికెటర్స్‌తో పోటీ పడడం.. ఇందులోనే గిల్ మజా వెదుక్కుంటున్నాడు. అందుకే సెంచరీల స్కోర్ బోర్డ్ పరిగెడుతోంది.

మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. న్యూజిలాండ్‌పై శుభ్‌మన్ గిల్ పెర్ఫార్మెన్స్. అది కూడా తెలుగు గడ్డపై ఉప్పల్ స్టేడియంలో ఆడిన ఆ ఆట చూడాలి.. వారెవ్వా అనకుండా ఉండలేరు. కివీస్‌పై బాదిన డబుల్ సెంచరీని చూసి. అరే ఏం ఆడుతున్నాడ్రా అని అందరూ ఒకటే చప్పట్లు. పైగా చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా మరో రికార్డ్ కూడా కొట్టాడు. గిల్‌కు ఓ మైనస్ ఉంది. సెంచరీలు చేసి వెంటనే పెవిలియన్ బాట పడతాడు. కానీ ఇది ఆయన ఫాదర్ లఖ్విందర్ సింగ్‌ను బాగా బాధపెట్టేది. అందుకే కొడుకుతో ఖరాఖండీగా చెప్పేశాడు. ఆడి గెలవడమే కాదు.. ఆడి నిలవాలి కూడా అని. తండ్రి చెబితే ఏ కొడుకైనా ఎలా కాదంటాడు! అందుకే న్యూజిలాండ్‌పై డబుల్ సెంచరీ చేసి.. క్రీజ్‌లో లాంగ్ టైమ్ ఉండగలను.. స్కోర్ బోర్డ్‌ను ఉరకలెత్తించగలను అని చాటిచెప్పాడు.

వన్డేల్లో గిల్ సగటు కూడా ఫస్ట్ క్లాస్‌గా ఉంటుంది. కేవలం 38 ఇన్నింగ్స్‌లోనే వేగంగా 2000 పరుగులు పూర్తి చేయడమంటే మాటలా! అందుకే కదా గిల్‌కు రికార్డులు కూడా దాసోహం అయిపోతాయి. ఇక టీ20ల్లో అయితే దూకుడే దూకుడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడంటేనే అర్థమవుతోంది.. గిల్ అంటే ఏంటో! న్యూజిలాండ్‌పై టీ20 ఆడి 126 నాటౌట్‌గా నిలిచాడు. గిల్ వయసులో చిన్నోడు. రికార్డుల్లో పెద్దోడు. ఇంకా చాలా లాంగ్ కెరీర్ ఉంది. అందుకే గిల్ పేరు చెబితే క్రికెట్ ఫ్యాన్స్‌కు పూనకాలే. దీనివల్లే గూగుల్‌లో ఎక్కువమంది మనోడి కోసం సెర్చ్ చేశారు. ఇదే గిల్‌కు సెకండ్ ప్లేస్ వచ్చేలా చేసింది. సో.. పంజాబీ థౌజండ్ వాలా.. గూగుల్‌లో హీరో ఇవాళ. ఇలాగే బాగా ఆడుతూ.. మరిన్ని రికార్డులు సాధించాలి. ఆల్ ది బెస్ట్ హీరో.

(Gunnesh UV, TV9 Executive Editor)