New Zealand Vs Bangladesh: న్యూజిలాండ్ చేరుకున్న బంగ్లాదేశ్ జట్టు టెస్టు సిరీస్‌ను విజయంతో శుభారంభం చేసింది. మౌంట్ మంగూయ్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి చారిత్రాత్మక విజయం సాధించింది. బంగ్లాదేశ్ జట్టు కివీస్‌పై టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించడం 21 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. ఈ ఓటమికి ముందు, ఆతిథ్య జట్టు ఇప్పటి వరకు స్వదేశంలో బంగ్లాదేశ్‌తో ఏ ఫార్మాట్‌లోనూ ఓడిపోలేదు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.
బంగ్లాదేశ్ సాధించిన ఈ విజయం ఎంత కీలకమైంది. ఎందుకంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఛాంపియన్ టీమ్ న్యూజిలాండ్ 5 సంవత్సరాలుగా, అలాగే 17 టెస్ట్ మ్యాచ్‌ల తర్వాత స్వదేశంలో ఓడిపోయింది. సిరీస్‌లో రెండో టెస్టు జనవరి 9 నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో జరగనుంది. బంగ్లాదేశ్‌కు ప్రస్తుతం తొలిసారి కివీస్‌తో టెస్టు సిరీస్‌ను గెలుచుకునే అవకాశం ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ ఈ విజయంతో బంగ్లాదేశ్‌కు 12 కీలకమైన పాయింట్లు వచ్చాయి.
ఇబాదత్ హుస్సేన్ అద్భుతం..
ఐదు వికెట్ల నష్టానికి 147 పరుగులతో న్యూజిలాండ్ టీం ఐదో రోజు ఆట ప్రారంభించింది. చివరి ఐదు వికెట్లు కేవలం 22 పరుగులు మాత్రమే జోడించడంతో ఘెరపరాజయం పాలైంది. ఆ ఘనత బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ఇబాదత్ హొస్సేన్‌కు చెందుతుంది. ఇబాదత్ హుస్సేన్ 46 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీశాడు. టెస్టు క్రికెట్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇదే కావడం విశేషం. న్యూజిలాండ్‌కు రాకముందు, అతను 10 టెస్ట్ మ్యాచ్‌లలో 81.54 సగటుతో 11 వికెట్లు సాధించాడు. ఇక మరో బౌలర్ తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టి తనవంతు సహకారం అందించాడు. మెహదీ హసన్ మిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ ముందు కేవలం 42 పరుగుల లక్ష్యం నిలిచింది.
పేలవమైన ఆరంభం.. ఆ తర్వాత విజయం..
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం అంతగా బాగోలేదు. టీమ్ సౌథీ వేసిన రెండో ఓవర్‌లోనే ఓపెనర్ షాద్‌మన్ ఇస్లాం (3) వికెట్ కోల్పోయింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత అర్ధ సెంచరీ సాధించిన నజ్ముల్ హసన్ శాంటో (17)ను కైల్ జేమీసన్ పెవిలియన్‌కు పంపాడు. అనంతరం కెప్టెన్ మోమినుల్ హక్ (13 నాటౌట్), ముష్ఫికర్ రహీమ్ (5 నాటౌట్) బాధ్యతగా ఆడి మరో వికెట్ పడకుండా బంగ్లాకు విజయాన్ని చేకూర్చారు.
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 328 పరుగులు చేసింది. ఆతరువాత బంగ్లా కెప్టెన్ మోమినుల్ హక్ (88), లిటన్ దాస్ (86), మహ్మదుల్ హసన్ జాయ్ (78), నజ్ముల్ హొస్సేన్ శాంటో (64) అర్ధ సెంచరీల సాయంతో 458 పరుగులు చేసి 130 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది.
Also Read: Ranji Trophy: రంజీ ట్రోఫీని వదలని కరోనా.. అన్ని దేశీయ టోర్నమెంట్‌లు వాయిదా వేసిన బీసీసీఐ..!
IND vs SA: సౌతాఫ్రికా వెన్నువిరిచిన శార్దూల్ ఠాకూర్.. ఎన్నో రికార్డులు సృష్టించాడు..