
న్యూజిలాండ్ ఫీల్డింగ్‌లో మరోసారి అద్భుతం చేసింది. భారత బ్యాటర్ నామన్ ధీర్ (Naman Dhir)ను పెవిలియన్‌కు పంపిన తీరు ఇప్పుడు మ్యాచ్‌లో హైలైట్‌గా మారింది. ఇది కేవలం ఒక ఫీల్డర్ పట్టిన క్యాచ్ కాదు.. ఇద్దరు ఆటగాళ్లు కలిసి పూర్తి చేసిన అద్భుతమైన టీమ్‌వర్క్. 11.2 ఓవర్‌లో జాకబ్ డఫీ (Jacob Duffy) వేసిన బంతిని నామన్ ధీర్ భారీ షాట్‌గా మలిచాడు. బంతి లాంగ్ ఆన్ వైపు గాల్లోకి వెళ్లింది. అక్కడ ఉన్న డారిల్ మిచెల్ (Daryl Mitchell) అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు.
క్యాచ్ అందుకున్న సమయంలో మిచెల్ వేగం కారణంగా బౌండరీ లైన్ దాటే పరిస్థితి ఏర్పడింది. దీంతో బంతిని చేతిలో ఉంచుకుని ముందుకు వెళ్లడం ప్రమాదమని గుర్తించిన మిచెల్.. వెంటనే దాన్ని గాల్లోకి విసిరాడు. అదే సమయంలో డీప్ మిడ్ వికెట్ నుంచి నాథన్ స్మిత్ (Nathan Smith) బంతి వైపు దూసుకొచ్చాడు.
మిచెల్ విసిరిన బంతిలో వేగం ఎక్కువగా ఉండటంతో స్మిత్ తన పరుగు ఆపి.. ముందుకు డైవ్ చేస్తూ బంతిని అందుకున్నాడు. నేలపై పడుతూనే క్యాచ్‌ను సురక్షితంగా పూర్తి చేశాడు.
నమన్ ధీర్ మాత్రం ఇది క్యాచ్ కాదని భావిస్తూ క్రీజులోనే ఉన్నాడు. ఫీల్డర్ల మధ్య అద్భుతమైన సమన్వయం చూసిన తర్వాత టీవీ అంపైర్‌కు నిర్ణయాన్ని అప్పగించారు. రీప్లేలో మిచెల్ బౌండరీ లైన్‌ను తాకలేదని స్పష్టమైంది. దీంతో థర్డ్ అంపైర్ క్లీన్ క్యాచ్గా ప్రకటించాడు.
నమన్ ధీర్ 13 బంతుల్లో 28 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా.. ఈ అద్భుతమైన క్యాచ్‌తో అతడి పోరాటం ముగిసింది.
కామెంటేటర్లు కూడా ఈ ఫీల్డింగ్‌ను “క్యాచ్ ఆఫ్ ది ఇయర్” అంటూ ప్రశంసించారు. ఒక ఫీల్డర్ క్యాచ్ అందుకుని.. బౌండరీ ప్రమాదాన్ని గుర్తించి మరో ఫీల్డర్‌కు బంతిని విసరడం, ఆ తర్వాత రెండో ఫీల్డర్ డైవ్ చేస్తూ క్యాచ్ పూర్తి చేయడం నిజంగా అరుదైన దృశ్యమే.
క్యాచ్ ఒక్కరిది కాదు.. క్రెడిట్ మాత్రం ఇద్దరిదీ! న్యూజిలాండ్ ఫీల్డింగ్‌కు ఈ వికెట్ మరో అద్భుత ఉదాహరణగా నిలిచింది.