Watch Video: ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ.. సాక్షి రియాక్షన్ అదిరింది

Watch Video: అంబానీ కుటుంబం నిర్వహించిన జామ్‌నగర్ నవరాత్రి వేడుకల్లో ఎంఎస్ ధోనీ తన భార్య సాక్షితో సరదాగా గడిపారు. ఐస్‌క్రీమ్ తినిపిస్తానంటూ స్పూన్‌ను వెనక్కి లాగి తానే తిన్న ధోనీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాక్షి రియాక్షన్, అనంత్ అంబానీతో రైడ్ వీడియోలు కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

Watch Video: ఐస్‌క్రీమ్‌తో భార్యను ఆటపట్టించిన ధోనీ.. సాక్షి రియాక్షన్ అదిరింది
Ms Dhoni

Updated on: Oct 19, 2026 | 8:41 PM

Watch Video: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉంటారో.. బయట మాత్రం అంతే సరదాగా ఉంటారు. ముఖ్యంగా భార్య సాక్షి ధోనీతో ఆయన చేసే అల్లరి అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ధోనీ, సాక్షి కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ధోనీ ఐస్‌క్రీమ్ తినిపిస్తానంటూ సాక్షిని ఆటపట్టించారు. ఆయన చేసిన చిన్నపాటి ప్రాంక్ చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. వైరల్ వీడియోలో ధోనీ చేతిలో ఐస్‌క్రీమ్ కప్ కనిపిస్తుంది. అందులోంచి స్పూన్‌తో ఐస్‌క్రీమ్ తీసుకుని సాక్షికి తినిపించేందుకు ఆమె నోటి దగ్గరకు తీసుకెళ్తారు. సాక్షి తినడానికి ముందుకు రాగానే ధోనీ స్పూన్‌ను వెనక్కి లాగి ఐస్‌క్రీమ్‌ను తానే తినేస్తారు. దీంతో సాక్షికి ఒక్క ముద్ద కూడా దక్కదు. ధోనీ అక్కడితో ఆగకుండా మరోసారి అదే పని చేయడానికి ప్రయత్నిస్తారు. ఈసారి సాక్షి సరదాగా ఆయన చేతిపై కొట్టడంతో ఇద్దరి మధ్య ఉన్న చిలిపి అనుబంధం కనిపిస్తుంది. ఈ చిన్న వీడియో అభిమానులకు నవ్వులు పంచుతోంది.

అంబానీ నవరాత్రి వేడుకల్లో ధోనీ సందడి

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో అంబానీ కుటుంబం నిర్వహించిన నవరాత్రి మేళాకు ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. అక్టోబర్ 18న జరిగిన వేడుకల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కూడా పాల్గొన్నారు. రిలయన్స్ టౌన్‌షిప్‌లో జరిగిన ఈ వేడుకల్లో ఆటలు, వినోద కార్యక్రమాలు, జాతర వాతావరణం సందడి చేశాయి. ధోనీ తెల్లటి టీషర్ట్, నీలం రంగు జీన్స్‌లో కనిపించగా.. అక్కడి నుంచి వచ్చిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అనంత్ అంబానీతో రైడ్

నవరాత్రి మేళాలో ధోనీ ఐస్‌క్రీమ్ తినడమే కాదు.. పలు వినోద కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌తో కలిసి ఓ డ్రాగన్ బోట్ రైడ్‌ను ఆస్వాదించిన వీడియో కూడా వైరల్ అయింది. రైడ్ వేగంగా కదులుతున్నా ధోనీ తనదైన ప్రశాంతమైన ముఖకవళికలతో కనిపించడం అభిమానులను ఆకట్టుకుంది. అయితే సాక్షికి ఐస్‌క్రీమ్ తినిపించకుండా తానే తినేసిన వీడియో మాత్రం ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. కొందరు నెటిజన్లు ధోనీని సరదాగా ప్రొఫెషనల్ ప్రాంక్‌స్టర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

క్రికెట్‌కు దూరమైనా అదే క్రేజ్

ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆయన కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచింది. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్నారు. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆయన ఆడతారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. క్రికెట్‌కు సంబంధించిన వార్తలతోనే కాకుండా, కుటుంబంతో గడిపే సరదా క్షణాలతోనూ ధోనీ తరచూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. జామ్‌నగర్‌లో సాక్షితో చేసిన ఈ ఐస్‌క్రీమ్ అల్లరి అందుకు మరో ఉదాహరణగా నిలిచింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us