
Mohammed Shami: టీమిండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. రంజీ ట్రోఫీ 2026-27లో బెంగాల్ తరఫున ఆడుతున్న ఈ స్టార్ పేసర్.. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఏకంగా 23.5 ఓవర్లు వేసి 37 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఇందులో 8 మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. అంటే దాదాపు 24 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. అతడి ఎకానమీ కేవలం 1.55గా నమోదైంది. ఈ ప్రదర్శనతో దేశవాళీ క్రికెట్‌లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించాడు.
మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో షమీ బౌలింగ్ ధాటికి కీలక బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఓపెనర్ పృథ్వీ షాను 12 పరుగులకే ఔట్ చేసిన షమీ.. ఆ తర్వాత సిద్ధేశ్ వీర్, దిగ్విజయ్ పాటిల్‌ను కూడా వెనక్కి పంపాడు. చివర్లో ప్రదీప్ ధాదే వికెట్ తీసి నాలుగు వికెట్ల ప్రదర్శన పూర్తి చేశాడు. ముఖ్యంగా సిద్ధేశ్ వీర్‌ను 28 పరుగుల వద్ద, దిగ్విజయ్ పాటిల్‌ను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపడం బెంగాల్‌కు కీలకంగా మారింది. మరోవైపు మహారాష్ట్ర బ్యాటర్లు షమీ బౌలింగ్‌లో పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. అతడి కచ్చితమైన లైన్, లెంగ్త్, స్వింగ్ మరోసారి కనిపించాయి.
షమీ ఇంతలా బౌలింగ్ చేసినా బెంగాల్ జట్టుకు మాత్రం విజయం దక్కలేదు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 143 పరుగులకే కుప్పకూలింది. అనంతరం మహారాష్ట్ర 218 పరుగులు చేసి 75 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బెంగాల్ బ్యాటర్లు నిరాశపరిచారు. అభిషేక్ పోరెల్ 65 పరుగులు, సుమంత గుప్తా 59 పరుగులతో పోరాడటంతో జట్టు 186 పరుగులు చేయగలిగింది. దీంతో మహారాష్ట్ర ముందు 112 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. పృథ్వీ షా 53, సచిన్ ధాస్ 61 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు 10 వికెట్ల విజయాన్ని అందించారు.
షమీకి ఈ సీజన్‌లో ఇది ఒక్కటే అద్భుత ప్రదర్శన కాదు. అంతకుముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీసి మొత్తం ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్‌లో బెంగాల్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత కేరళతో జరిగిన పోరులోనూ షమీ తన జోరు కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి మొత్తం ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో బెంగాల్ ఏకంగా 287 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఇలా వరుస మ్యాచ్‌ల్లో నిలకడగా వికెట్లు తీస్తూ తన ఫిట్‌నెస్, బౌలింగ్ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో షమీ ఇంత అద్భుతంగా రాణిస్తున్నా భారత జట్టులో అతడికి తిరిగి ఎప్పుడు అవకాశం వస్తుందనే చర్చ మాత్రం కొనసాగుతోంది. ముఖ్యంగా రంజీ ట్రోఫీలో వరుసగా వికెట్లు తీస్తుండటం సెలక్టర్ల దృష్టిని ఆకర్షించే అంశం. కొత్త బంతితో స్వింగ్ చేయడం, పాత బంతితోనూ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడం షమీ ప్రత్యేకత. వన్డే ప్రపంచకప్ 2027కు ముందు భారత జట్టుకు సీనియర్ పేసర్ అవసరం ఏర్పడితే షమీ పేరు పరిశీలనలోకి రావచ్చు. అయితే అతడి రీఎంట్రీ పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. మరి రంజీలో ఇదే జోరు కొనసాగించి మళ్లీ టీమిండియా జెర్సీ వేసుకుంటాడో లేదో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..