
Vaibhav Suryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. జింబాబ్వే వేదికగా జరగనున్న అండర్-19 వరల్డ్ కప్ 2026 కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుంది. జనవరి 15న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన వేటను ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీలో వైభవ్ ఒక భారీ లక్ష్యాన్ని తన కళ్లముందు ఉంచుకున్నాడు. అదే మిషన్ 607. ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు.
ఏమిటీ మిషన్ 607?
అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆయిన్ మోర్గాన్ పేరిట ఉంది. మోర్గాన్ 2004 మరియు 2006లో ఐర్లాండ్ తరపున ఆడి మొత్తం 606 పరుగులు చేశాడు. అయితే వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించి 607 పరుగులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మోర్గాన్ ఈ ఘనతను రెండు వరల్డ్ కప్ లలో సాధించగా, వైభవ్ మాత్రం తన అద్భుత ఫామ్‌తో ఈ ఒక్క టోర్నీలోనే ఆ మైలురాయిని చేరుకోవాలని చూస్తున్నాడు. ఇది వినడానికి కష్టంగా అనిపించినా, వైభవ్ బాదుడు చూస్తుంటే అది అసాధ్యమేమీ కాదనిపిస్తోంది.
సౌతాఫ్రికాలో విధ్వంసం
ఇటీవల జరిగిన సౌతాఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ చెలరేగిపోయాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ టీమిండియాకు 3-0తో వన్డే సిరీస్‌ను అందించాడు. బౌలర్ ఎవరైనా సరే ఏమాత్రం కనికరం లేకుండా స్టేడియం బయటకు పంపడమే వైభవ్ స్టైల్. అదే ఊపును ఇప్పుడు వరల్డ్ కప్ లో కూడా కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ముఖ్యంగా ఓపెనర్ గా వైభవ్ ఇచ్చే మెరుపు ఆరంభాలు భారత్ కు కొండంత బలాన్ని ఇస్తున్నాయి.
షెడ్యూల్, వార్మప్ మ్యాచులు
వరల్డ్ కప్ మెయిన్ మ్యాచుల కంటే ముందు వైభవ్ రెండు వార్మప్ మ్యాచుల్లో తన సత్తా చాటనున్నాడు. జనవరి 10న స్కాట్లాండ్‌తో, ఆ తర్వాత ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది. ఇక అసలైన టోర్నీలో జనవరి 15న అమెరికాతో, 17న బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. మూడో లీగ్ మ్యాచ్ జనవరి 24న జరుగుతుంది. ఫిబ్రవరి 3, 4 తేదీల్లో సెమీ ఫైనల్స్, ఫిబ్రవరి 6న గ్రాండ్ ఫైనల్ జరగనుంది. వైభవ్ గనుక ఫైనల్ వరకు తన ఫామ్‌ను కొనసాగిస్తే మిషన్ 607 సాధించడం నల్లేరు మీద నడకే.
అతి చిన్న వయసులోనే ఎంతో పరిణతితో ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణంగా కనిపిస్తున్నాడు. మరి ఆయిన్ మోర్గాన్ 20 ఏళ్ల నాటి రికార్డును వైభవ్ తుడిచిపెట్టగలడా? లేదా అనేది చూడాలి. క్రికెట్ అభిమానులంతా ఈ యువ కెరటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..