
Mike Hussey : మిస్టర్ క్రికెట్‌గా ప్రసిద్ధి చెందిన ఆస్ట్రేలియా మాజీ దిగ్గజ క్రికెటర్ మైక్ హస్సీ ప్రకటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎక్కువ అవకాశాలు లభించి ఉంటే లేదా సరైన సమయంలో అరంగేట్రం చేసి ఉంటే, తాను క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కంటే 5000 పరుగులు ఎక్కువ చేసేవాడినని హస్సీ పేర్కొన్నారు.
ది గ్రేడ్ క్రికెటర్ యూ-ట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మైక్ హస్సీ మాట్లాడారు. “నా సమయానికి ఆస్ట్రేలియా క్రికెట్‌లో చాలా మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉండేవారు, దాని కారణంగా నాకు ఆలస్యంగా అవకాశం లభించింది. ఒకవేళ నాకు సరైన సమయంలో అవకాశం దొరికి ఉంటే, నేను ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పరుగులు చేసేవాడిని” అని హస్సీ అన్నారు.
హస్సీ ఈ విషయాన్ని మరింత వివరిస్తూ.. “నేను దీని గురించి చాలా ఆలోచించాను. నేను సచిన్ కంటే 5000 పరుగుల వెనుక ఉండిపోయాను, కానీ నేను ముందుగా వచ్చి ఉంటే, ఎక్కువ పరుగులు, ఎక్కువ విజయాలు, ఎక్కువ సెంచరీలు, ఎక్కువ యాషెస్, ఎక్కువ ప్రపంచ కప్‌లు అన్నీ నా పేరు మీదే ఉండేవి” అని పేర్కొన్నారు. ఆ తర్వాత దురదృష్టవశాత్తూ తాను ఉదయం లేవగానే ఇదంతా కలగా అనిపిస్తుందని, అప్పుడే తనకు ముందే అవకాశం దొరికితే బాగుండేది అనిపిస్తుందని అన్నారు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సచిన్ టెండూల్కర్ పేరిటే ఉన్నాయి. టెస్టుల్లో సచిన్ 15921 పరుగులు, వన్డేల్లో 18426 పరుగులు, టి20ల్లో 10 పరుగులు చేశారు. ఇలా సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 34 వేలకు పైగా పరుగులు సాధించారు. ఇప్పుడు హస్సీ తాను సచిన్ కంటే 5000 పరుగులు ఎక్కువ చేసేవాడినని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మైఖేల్ హస్సీకి దాదాపు 31 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఆయన ఆస్ట్రేలియా తరఫున 79 టెస్టులు, 185 వన్డేలు మరియు 38 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో హస్సీ 6235 పరుగులు, వన్డేల్లో 5442 పరుగులు, టి20ల్లో 721 పరుగులు సాధించారు. హస్సీ టెస్టుల్లో 19, వన్డేల్లో 3 సెంచరీలు చేశారు. సచిన్ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు సాధించగా, హస్సీ 22 సెంచరీలతో 78 సెంచరీల వెనుక ఉండిపోయారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..