Dhoni: ఐపీఎల్ కెరీర్‌ ఖేల్ ఖతం.. కట్ చేస్తే.. 21ఫోర్లు, 12 సిక్సర్లతో ధోని టీమ్‌మేట్ డబుల్ సెంచరీ..

|

Jan 06, 2023 | 1:23 PM

కేదార్ జాదవ్... ఈ పేరు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడో మర్చిపోయారు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ దాదాపుగా ఈ ఆటగాడి కెరీర్ ముగిసినట్లేనని చెప్పాలి..

Dhoni: ఐపీఎల్ కెరీర్‌ ఖేల్ ఖతం.. కట్ చేస్తే.. 21ఫోర్లు, 12 సిక్సర్లతో ధోని టీమ్‌మేట్ డబుల్ సెంచరీ..
Dhoni Player
Follow us on

కేదార్ జాదవ్… ఈ పేరు క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడో మర్చిపోయారు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లోనూ దాదాపుగా ఈ ఆటగాడి కెరీర్ ముగిసినట్లేనని చెప్పాలి. అయితే ఇప్పుడు కేదార్ జాదవ్ రీ-ఎంట్రీ ఇచ్చాడు. రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరుతో అందరినీ కట్టిపడేశాడు. డీవై పటేల్ అకాడమీ మైదానంలో అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర తరపున బరిలోకి దిగిన కేదార్ జాదవ్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు.

12 సిక్సర్లు, 21 ఫోర్ల సాయంతో కేదార్ జాదవ్ 283 పరుగులు బాదాడు. 95 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న మహారాష్ట్ర జట్టును.. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ చక్కటి ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ఓపెనర్ సిద్దేశ్ వీర్(106)తో కలిసి మూడో వికెట్‌కు 280 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కేదార్ 207 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. 258 బంతుల్లో 250 పరుగులు సాధించాడు. ఈ ఆటగాడు తృటిలో తన ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. మరోవైపు కేదార్ జాదవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 327 పరుగులు.

టీమ్ ఇండియా, ఐపీఎల్ నుంచి కేదార్ జాదవ్ ఔట్..

మహారాష్ట్రకు చెందిన కేదార్ జాదవ్ గత 3 సంవత్సరాలుగా జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేక సతమతమవుతున్నాడు. అతడు తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఫిబ్రవరి 2020లో ఆడాడు. పేలవమైన ఫామ్ కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో కూడా ఈ ఆటగాడు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. 2022 సీజన్‌లో జాదవ్‌కు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడే అవకాశం రాలేదు. 2023 ఐపీఎల్ వేలంలో కూడా జాదవ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.