
Ramakrishna Ghosh : క్రికెట్ మైదానంలో అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. కానీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర బౌలర్ రామకృష్ణ ఘోష్ చేసిన మ్యాజిక్ మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయేలా ఉంది. గెలుపు ముంగిట ఉన్న గోవా జట్టు నోటికాడి ముద్దను లాగేసిన ఈ యువ బౌలర్, చివరి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. జైపూర్‌లోని డాక్టర్ సోనీ స్టేడియంలో జరిగిన ఈ పోరులో మహారాష్ట్ర జట్టు ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది.
మహారాష్ట్ర, గోవా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మహారాష్ట్ర జట్టు గోవా ముందు 250 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్ష్య చేధనలో గోవా దాదాపు విజయం సాధించినంత పని చేసింది. ఆఖరి మూడు ఓవర్లలో గోవా విజయానికి కేవలం 11 పరుగులు మాత్రమే కావాలి. చేతిలో వికెట్లు ఉన్నాయి, క్రీజులో బ్యాటర్లు ఉన్నారు.. గోవా విజయం లాంఛనమే అని అందరూ భావించారు. కానీ అక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది.
మహారాష్ట్ర కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. యువ బౌలర్ రామకృష్ణ ఘోష్‌పై నమ్మకం ఉంచి 48వ ఓవర్ బౌలింగ్ ఇచ్చాడు. ఆ ఓవర్లో రామకృష్ణ ఒక్క రన్ కూడా ఇవ్వకుండా మెయిడెన్ వేశాడు. ఆ తర్వాత 49వ ఓవర్లో మహారాష్ట్ర బౌలర్లు 5 పరుగులు ఇచ్చారు. దీంతో చివరి ఓవర్లో గోవా విజయానికి కేవలం 6 పరుగులు అవసరమయ్యాయి. భారీ హిట్టర్లు ఉన్న గోవాకు 6 పరుగులు పెద్ద లెక్క కాదు. కానీ రామకృష్ణ మళ్ళీ అద్భుతం చేశాడు. వేసిన ఆరు బంతులను డాట్ బాల్స్ (0,0,0,0,0,0)గా వేసి.. చివరి ఓవర్ ను కూడా మెయిడెన్ చేయడంతో మహారాష్ట్ర 5 పరుగుల తేడాతో గెలిచింది.
ఈ మ్యాచ్‌లో రామకృష్ణ మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 35 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇందులో అత్యంత విశేషం ఏమిటంటే.. అతను వేసిన స్పెల్ లో రెండు మెయిడెన్ ఓవర్లు ఉండటం. అది కూడా మ్యాచ్ లో అత్యంత కీలకమైన 48వ ఓవర్, 50వ ఓవర్ కావడం విశేషం. రామకృష్ణ బంతులను అర్థం చేసుకోవడంలో గోవా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపిన రామకృష్ణ ఘోష్‌పై ఇప్పుడు ఐపీఎల్ ఫ్యాన్స్ కన్ను పడింది. ఇతను ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. రూ.30 లక్షల బేస్ ప్రైస్‌తో సీఎస్‌కే అతడిని రిటైన్ చేసుకుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆరంగేట్రం చేసే అవకాశం రాలేదు కానీ, ఈ తాజా ప్రదర్శనతో కెప్టెన్ రుతురాజ్, సీఎస్‌కే మేనేజ్‌మెంట్ దృష్టిలో రామకృష్ణ పడ్డాడు. రాబోయే సీజన్లో రామకృష్ణ ఘోష్ ఎల్లో జెర్సీలో ఐపీఎల్ లో ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..