Vijay Hazare Trophy : టీవీల్లో రాదు.. ఫోన్ లో రాదు.. మరి రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ చూడాలంటే ఏం చేయాలి సామి ?

Vijay Hazare Trophy : చాలా కాలం తర్వాత భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025 లో భాగంగా డిసెంబర్ 24 నుంచి వీరిద్దరూ తమ తమ జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు.

Vijay Hazare Trophy : టీవీల్లో రాదు.. ఫోన్ లో రాదు.. మరి రోహిత్, కోహ్లీ బ్యాటింగ్ చూడాలంటే ఏం చేయాలి సామి ?
Vijay Hazare Trophy

Updated on: Dec 24, 2025 | 10:41 AM

Vijay Hazare Trophy : చాలా కాలం తర్వాత భారత క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దేశవాళీ క్రికెట్ మైదానంలో అడుగుపెడుతున్నారు. విజయ్ హజారే ట్రోఫీ (VHT) 2025 లో భాగంగా డిసెంబర్ 24 నుంచి వీరిద్దరూ తమ తమ జట్ల తరపున బరిలోకి దిగుతున్నారు. బీసీసీఐ కొత్త నిబంధనల ప్రకారం.. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలన్న ఆదేశంతో ఈ ఇద్దరు స్టార్లు గ్రౌండ్‌లోకి వస్తున్నారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతుండటం విశేషం. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ జట్టు తరపున కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టుతో ఢిల్లీ తలపడనుంది. నిజానికి ఈ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల వేదికను మార్చారు. ఇటు పంత్, అటు కోహ్లీ ఒకే జట్టులో ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరోవైపు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన సొంత జట్టు ముంబై తరపున ఆడుతున్నాడు. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో సిక్కిం జట్టుతో ముంబై తలపడనుంది. శార్దూల్ ఠాకూర్ కెప్టెన్సీలో రోహిత్ శర్మ బరిలోకి దిగుతుండటం గమనార్హం. అంతర్జాతీయ వన్డేల్లో భీకర ఫామ్‌లో ఉన్న రోహిత్, దేశవాళీ పిచ్‌లపై ఎలాంటి విన్యాసాలు చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడ టైమింగ్స్ మారాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు మధ్యాహ్నం 1:30కి మొదలైతే, ఈ మ్యాచ్‌లు ఉదయం 9:30 గంటలకే ప్రారంభమవుతాయి.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న అభిమానులకు చేదు వార్త మిగిలింది. కోహ్లీ ఆడుతున్న ఢిల్లీ vs ఆంధ్ర మ్యాచ్ కానీ, రోహిత్ ఆడుతున్న ముంబై vs సిక్కిం మ్యాచ్ కానీ టీవీల్లో ప్రసారం కావడం లేదు. అలాగే ఎటువంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోనూ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కేవలం సెలక్టెడ్ కొన్ని మ్యాచ్‌లను మాత్రమే స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. విరాట్, రోహిత్ మ్యాచ్‌లు ఈ లిస్టులో లేకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశకు గురిచేస్తోంది.

ఈ ఏడాది నుంచి బీసీసీఐ ఒక కొత్త రూల్ తెచ్చింది. దీని ప్రకారం సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ఆటగాళ్లు కచ్చితంగా సీజన్‌లో కనీసం రెండు దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలి. ఈ నిబంధన వల్లే కోహ్లీ, రోహిత్ వంటి సీనియర్లు మళ్ళీ లోకల్ గ్రౌండ్స్‌లో కనిపిస్తున్నారు. ఇది యువ ఆటగాళ్లకు గొప్ప అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా, దేశవాళీ క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను పెంచుతుందని బోర్డు భావిస్తోంది. మరి ఈ దిగ్గజాలు తమ జట్లను విజయతీరాలకు చేరుస్తారో లేదో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..