
Condom Ads : భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ ప్రసారాల సమయంలో సరికొత్త వివాదం చెలరేగింది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారంలో కండోమ్ ప్రకటనలను టెలికాస్ట్ చేయడంపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీ, భారత మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబాలు, చిన్న పిల్లలు కలిసి చూసే అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లలో ఇలాంటి అడల్ట్ కంటెంట్ ప్రకటనలు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఈ విషయమై ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా బీసీసీఐని ట్యాగ్ చేస్తూ ఘాటుగా స్పందించారు.
కీర్తి ఆజాద్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో.. “భారత్, ఇంగ్లాండ్ మధ్య ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ను చిన్న పిల్లలు కూడా ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. ఇలాంటి సమయంలో స్క్రీన్‌పై డ్యూరెక్స్ లాంటి అడల్ట్ ప్రకటనలు రావడం సిగ్గుచేటు కాదా?” అని రాసుకొచ్చారు. ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కేవలం కొద్ది గంటల్లోనే ఈ ట్వీట్‌కు 3 లక్షల 26 వేలకు పైగా వ్యూస్, వందలాది కామెంట్లు వచ్చాయి. దాంతో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో ఎలాంటి యాడ్స్ వేయాలనే అంశంపై ఇంటర్నెట్‌లో పెద్ద చర్చ మొదలైంది.
కీర్తి ఆజాద్ లేవనెత్తిన ఈ అంశానికి చాలా మంది నెటిజన్లు మద్దతుగా నిలిచారు. క్రికెట్ అనేది భారతదేశంలో ఒక కుటుంబ వినోదం లాంటిదని, ఇంట్లోని పెద్దలు, పిల్లలు అందరూ కలిసి కూర్చుని మ్యాచ్‌లు చూస్తారని కొందరు పేర్కొన్నారు. “మీరు చెప్పింది వంద శాతం నిజం సార్. మా తల్లిదండ్రులతో కలిసి మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆ యాడ్స్ రావడం వల్ల చాలా ఇబ్బందిగా అనిపించింది, అందుకే నేను టీవీ కట్టేసి పక్కకు వచ్చేశాను” అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. పెద్దవాళ్లకు కూడా ఆ సమయంలో ఫ్యామిలీతో కలిసి కూర్చోవడం కాస్త ఇబ్బందికరంగా మారిందని మరికొందరు అభిప్రాయపడ్డారు.
అయితే, మరో వర్గం నెటిజన్లు మాత్రం ఈ ప్రకటనలను గట్టిగా సమర్థించారు. ప్రస్తుత కాలంలో సురక్షిత శృం**గారం, జనాభా నియంత్రణ, గర్భనిరోధక సాధనాలపై అవగాహన పెంచడం చాలా ముఖ్యమని వారు వాదించారు. “మిస్టర్ ఆజాద్.. దేశంలో పెరుగుతున్న జనాభాను అదుపు చేయాలంటే ఇలాంటి అవగాహనలు చాలా అవసరం. పిల్లలకు కూడా వీటిపై అవగాహన కల్పించాలి. క్రీడా మైదానాల కంటే దీనికి పెద్ద వేదిక ఏముంటుంది?” అని ఒక నెటిజన్ కౌంటర్ ఇచ్చారు. అలాగే, నేటి సమాజంలో కండోమ్స్ వాడకం రక్షణకు ఎంతో ముఖ్యం కాబట్టి, ఇందులో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదని మరికొందరు నెటిజన్లు రాసుకొచ్చారు.
శనివారం మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఈ రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ ఉత్కంఠభరిత పోరులో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 191 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఇంగ్లాండ్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ కేవలం 46 బంతుల్లోనే 76 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 1-0 ఆధిక్యంలో నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..